దేశానికే దిక్సూచిగా తెలంగాణ

సంగా రెడ్డి జిల్లా : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా మారాయని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ గ్రామంలో డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణకు వాహనాలు, ప్రకృతి వనాలు, ప్రతీ నెలా పల్లె ప్రగతి కింద నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. రైతు వేదికలు భవిష్యత్తుకి ఒక దిక్సూచిలా, గుండెకాయలా పని చేస్తాయని, రైతు వేదికలు రైతులను సంఘటితం చేసేందుకే అని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గుడుపల్లి గ్రామంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి భవనం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

కాంగ్రెస్, టీడీపీ పార్టీలు 70 యేండ్లు పాలించినా కనీసం చుక్క మంచినీళ్లు ఇవ్వలేకపోయాయని, సీఎం కేసీఆర్ వచ్చాకే మిషన్ భగీరథ పేరుతో గ్రామ గ్రామాన, ఇంటింటికి తాగు నీరు నల్లాల ద్వారా అందించడం గర్వంగా వుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో 14500కోట్లు రైతు బంధు ఇస్తున్నామని, రాష్ట్రంలో 2500 రైతు వేదికలు, రైతుల కోసమే సీఎం ఈ ఆలోచన చేసినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో సైతం రైతు బంధు, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు లేవని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్షాలు మాపై ఎన్ని ఆరోపణలు చేసినా , సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలే తమ పార్టీని ఆదరిస్తాయని ఆయన అన్నారు. మేం పని సరిగ్గా చేయకపోతే పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వచ్చి తెలంగాణలో చేరతామంటారా అంటూ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల 80 ఎకరాల్లో పండించిన కందులకు మద్దతు ధర ఆరు వేల రూపాయలు కల్పిస్తామని, మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే బయట అమ్ముకోవచ్చని హరీష్ రావు సూచించారు. చెరకు రైతులను ఇబ్బంది పెడుతోన్న షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ముక్కు పిండి బకాయిలు వసూలు చేసి ఇప్పిస్తామని, అవసరైతే షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసి, బాధిత రైతులకు న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక్కడ పండించే ‌చెరకు క్రషింగ్ కోసం కామారెడ్డి, సంగారెడ్డిలో ఉన్న సుగర్ ఫ్యాక్టరీల‌ద్వారా కొనుగోలు చేసి అక్కడి రైతులకు ఇచ్చే ధరనే ఇప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇక సింగూరుకు నీరు రాక ఆలస్యం అయ్యిందని, ఇప్పటి వరకు 95 పైసల పని పూర్తైందని, త్వరలోనే ప్రతీ ఇంటికీ మంజీర నీరు అందిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వచ్చే బడ్జెట్ లో సీసీ రోడ్లు, పంచాయతీకి బిల్డింగ్, డబుల్ బెడ్ రూం, తరగతి గదులు, కుల‌సంఘాల భవనాలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.