బీజాపూర్ ఎదురుకాల్పులు చరిత్రలోనే అతిపెద్ద దాడి

బీజాపూర్ జిల్లా : ఛత్తీస్​గఢ్​ బీజాపూర్​లోని అడవుల్లో జరిగిన ఎదురుకాల్పులు చరిత్రలోనే భద్రతాదళాలపై అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనలో దాదాపు 400 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. బీజాపుర్‌-సుకుమా జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలోని జాగర్‌గుండా, జొంగాగూడ, తారెం ప్రాంతంలో వ్యూహత్మక ప్రతిదాడిపై మావోయిస్టులు చర్చలు జరుపుతున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రతాదళాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో సీఆర్​పీఎఫ్​కు చెందిన ప్రత్యేక అటవీ విభాగం ‘కోబ్రా’ సహా బస్తరీయా బెటాలియన్‌, ఛత్తీస్‌గఢ్ పోలీసులకు చెందిన డీఆర్​జీ బృందాలు పాల్గొన్నాయి. మొత్తంగా 6 క్యాంపులకు చెందిన 15వందల మంది జవాన్లు.. ఆపరేషన్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 790 మంది ఆపరేషన్‌ కోసం అడవుల్లోకి వెళ్లగా మిగతా వారు వారికి సాయం అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ads

రెచ్చిపోయిన నక్సల్స్.. ఘటనా స్థలం వ్యూహాత్మకంగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం. కఠిన భూభాగంతో పాటు తక్కువ సంఖ్యలో భద్రతా బలగాల కదలికలు ఉండే గ్రామం అది. జవాన్లు సరిగ్గా అక్కడకు చేరుకోగానే దాదాపు 400 మంది నక్సల్స్‌ మూడు వైపుల నుంచి చుట్టుముట్టారు. జవాన్లపై లైట్‌ మెషిన్‌ గన్లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. వీటితో పాటు తక్కువ ప్రభావం చూపే ఐఈడీ బాంబులను విసిరారు. ఈ ఎదురుకాల్పుల్లో 23 మంది అమరులయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి భద్రతా బలగాలు కూడా దీటుగా స్పందించాయి. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు రాత్రి వరకు కొనసాగాయి. ఘటనలో దాదాపు 10 నుంచి 12 మంది.. మావోయిస్టుల చనిపోగా, వారిని సహచర మావోయిస్టులు ట్రాక్టర్‌ ట్రాలీల్లో తీసుకువెళ్లిపోయారు. ఈ దాడికి మావోల నుంచి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కు చెందిన హిద్మా, సుజాత నేతృత్వం వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

జవాన్ల తెగువ.. మధ్యాహ్నం రెండు గంటలకు భద్రతా దళాలు హెలికాఫ్టర్లను సాయం కోసం కోరగా, భీకర కాల్పుల కారణంగా అవి సాయంత్రం 5 గంటల వరకు ఘటనా స్థలంలో ల్యాండ్‌ కాలేని పరిస్థితి నెలకొంది. చాలావరకు జవాన్లు బుల్లెట్‌ గాయాలతోనే మరణించారని అధికారులు తెలిపారు. సహచర జవాన్లు నేలరాలుతున్నా కోబ్రా యూనిట్‌ ధైర్యంగా పోరాడిందని అధికారులు ప్రశంసించారు. వీరి ధైర్యం వల్లే నక్సల్స్‌ మరికాసేపు కాల్పులను కొనసాగించలేకపోయారని తెలిపారు. పెద్ద చెట్లను అడ్డుగా చేసుకొని, బుల్లెట్లు అయిపోయే వరకు భద్రతా బలగాలు ప్రతిఘటించారన్నారు. భద్రతా దళాలకు చెందిన దాదాపు 2 డజన్ల ఆధునాతన ఆయుధాలను నక్సల్స్‌ లూటీ చేశారని అధికారులు వెల్లడించారు.