అభివృద్ధిని చూసి వణుకుతున్నపార్టీ

కాంగ్రెస్​పై మండి పడ్డ మంత్రి జగదీశ్​రెడ్డిహైదరాబాద్​ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ వణికిపోతుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించిన సర్వేలలో తెలంగాణ మొదటిస్థానంలో ఉండడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై పీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. బుధవారం ఉదయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు.

‘తాగునీరు, సాగునీరు, 24 గంటల విద్యుత్ తో రాష్ట్రం అభివృద్ధి లో అగ్రగామిగా ఉంటే చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి మండిపడ్డారు ఆరేళ్ల పాలనతో 60 ఏళ్ల పాలనను పోలుస్తూ చర్చ పెడదామా..? అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మీరు పెంచిన పాపంతోటే కదా నల్లగొండ జిల్లా ఫ్లోరిన్ మయమైందన్నారు. అటువంటి ఫ్లోరిన్ మహమ్మారి ని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్నసాహసోపేత నిర్ణయం మిషన్ భగీరథ అని మంత్రి పేర్కొన్నారు.

మిషన్ భగీరథ తో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్​ఎస్సే అన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఫ్లోరోసిస్ కేసులు నమోదు కావడం లేదని కితాబిచ్చిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. జరుగుతున్న అభివృద్ధి ని చూసి తట్టుకోలేక అడ్రస్సే లేకుండా పోయిన కాంగ్రెస్ నాయకులు ఉనికి కోసమే ఇటువంటి దిగజారుడు విమర్శలకు పూనుకుంటున్నారని మంత్రి దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ ల నిర్మాణాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కోర్టులలో కేసులు వేసింది నిజం కాదా..? అని నిలదీశారు.

టెల్ ఎండ్ పేరుతో ఎడమ కాలువ భూములను ఎండపెట్టిన చరిత్ర మీది.. మీ పార్టీదని చెప్పారు. ఏ ఒక్క సంవత్సరమైనా ఎడమ కాలువ చివరి భూములకు నీళ్లు అందించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందా .. ? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం అంటే గురివిందనలు పెరగదన్న సామెత గుర్తుకు వస్తుందన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఎవరి కారులో డబ్బులు తగుల బడ్డాయో యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమేనని మంత్రి జగదీశ్​ రెడ్డి ఎద్దేవా చేశారు.

సీమాంధ్రుల ఏలుబడిలో బీ ఫారాల కోసం జంకి తెలంగాణ ను ఎడారిగా మారిస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. వరుసగా 20 నుంచి 30 ఏళ్లు ప్రజాప్రతినిధులు గా ఉండి కూడా నల్గొండ జిల్లాలో బోరుబావులమీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల ఉసురు తీసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు.

మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నేతల చరిత్రే అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. అటువంటి పార్టీ నేతలు అవినీతి గురించి మాట్లాడడం అంటేనే విడ్డరంగా ఉందని దెప్పి పొడిచారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ని యావత్ భారతదేశం ప్రశంసలతో ముంచెత్తుతుంటే పార్లమెంట్ లో రాష్ట్రం గురించి ప్రస్తవిస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఏమని ప్రస్తావిస్తాడో తెలంగాణ ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా ఫించన్ రద్దు చేయమంటారా, రైతుబంధు, రైతు భీమా వద్దు అంటారా .. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలను అడ్డుకుంటారా ఇంటింటికీ మంచినీటి సరఫరా వద్దు అంటారా ..? దేని గురించి ప్రస్తావిస్తారో తేల్చిచెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజానికి 2014 తరువాత కాంగ్రెస్ పార్టీపై ప్రజలే చార్జిషీట్లు వేస్తున్నారని అటువంటి పార్టీకి సీఎం కేసీఆర్ నాయకత్వం లోని టీఆర్ఎస్​ గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది’ అని మంత్రి జగదీశ్​రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్ర అభివృద్ధి పై కాంగ్రెస్ పార్టీ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్ లో మంత్రి జగదీష్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు ఒక్క ఇసుక మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 36 కోట్లు ఆర్జిస్తే 2015 తరువాత సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఇసుక పాలసితో రాష్ట్ర ప్రభుత్వం 3,780కోట్లు ఆర్జించిందని వెల్లడించారు.

ఈ ఒక్క విషయం చాలు టీఆర్ఎస్​ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందని స్పష్టం చేశారు. 14.2 శాతం తో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తే అది మరచిన కాంగ్రెస్ నేతలు స్థాయి మరచి దిగజారుడు విమర్శలకు పునుకుంటున్నారని పల్లా మండిపడ్డారు. త్రిపుర, సిక్కిం ల తరువాత ఆర్థికాభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు పల్లా రాజేశ్వర్​రెడ్డి.

ఆర్థికాభివృద్ధిలో లెజెండ్ ల మంటున్న పెద్ద పెద్ద రాష్ట్రాలను తోసిరాజని తెలంగాణ అభివృద్ధి సాధిస్తే కాంగ్రెస్ కు ఎందుకు కళ్లమంట అని ఆయన ఎద్ధేవా చేశారు. ఆయా రాష్ట్రాలు ఆర్థిక అవసరాల కోసం 25 శాతం వరకు అప్పులు చెయ్యవచ్చని ఐ ఆర్ బీ యం స్పష్టం చేసిందన్నారు. ఐ ఆర్ బీ ఎం నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం 22 శాతం అప్పు చేసిందని ఆయన వివరించారు. గణాంకాలు ఈ విధంగా ఉంటే పాలనాపరమైన అవగాహన లేక కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళం లోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని పల్లా ఆరోపించారు.

ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే ఎన్​ .భాస్కర్ రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టీఆర్​ఎస్​ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.