విమాన ప్రమాదంపై దర్యాప్తుకు ఉన్నతస్థాయి కమిటీ
వరంగల్ టైమ్స్, అహ్మదాబాద్ : అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ శనివారం వెల్లడించింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు అంచనా వేయనుంది.
అంతేకాదు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భద్రతా మార్గదర్శకాలను కూడా తనిఖీ చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్ వర్క్ ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని, ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనం పై కప్పు మీద విమాన శకలాలలో బ్లాక్ బాక్స్ ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్ బాక్స్ ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటలు తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు.
ఇందులో విమానానికి సంబంధించిన ఫ్లైట్ డాటా రికార్డర్ (ఎఫ్డీఆర్)వంటి సాంకేతిక సమాచారం, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) సంభాషణల సారాంశం నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో విమానంలోని ఇద్దరు పైలట్ ల మాటలు రికార్డవుతాయి. ప్రమాదానికి ముందు వారు ఏం మాట్లాడుకున్నారనేద తెలిస్తే దర్యాప్తు సులభమవుతుంది. బ్లాక్ బాక్స్ పక్కనే డీవీఆర్ లు ఉంటాయి.
విమానంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డయిన దృశ్యాలు ఇందులో ఉంటాయి. బ్లాక్ బాక్స్, డీవీఆర్ లోని డాటాని ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషిస్తాయి. ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి.గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ ఎయిర్ పోర్ట్ కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ సంఖ్య ఇప్పుడు 274కి చేరిందని తెలిపారు. వీరిలో 241 మంది విమాణ ప్రయాణికులు, సిబ్బంది కాగా, ఇతరులు 33 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతను అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.