సీఎం క్షమాపణ చెప్పాలి

వరంగల్ అర్బన్ జిల్లా : నాగార్జునసాగర్‎లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించిన తీరుపై బీజేపీ మండిపడుతోంది. కేసీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో మహిళామణులు, బీజేపీ నాయకులు కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు.

స్త్రీలను గౌరవించే భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీ‎ఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని, కేసీఆర్ సోయిలేని మాటలు మాట్లాడుతూ అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడని రావు పద్మ విమర్శించారు. బహిరంగ సభల్లో ప్రజలను ఏదో రకంగా ప్రేరేపించాలన్న ఉద్దేశంతో ఇతర పార్టీలపై విమర్శలు చేయడమే కాకుండా తెలంగాణ ప్రజానీకాన్ని అందులోనూ మహిళలను కించపరుస్తూ సీఎం కేసీఆర్ మాట్లాడటం సరైంది కాదని హెచ్చరించారు. తీరుకో మాట, సభకో మాట మాట్లాడుతూ చమత్కారి తనాన్ని ప్రదర్శించి ఇతరులను అవమానిస్తే తెలంగాణ ప్రజానీకం ఊరుకోదని రావు పద్మ హెచ్చరించారు. నాగార్జునసాగర్ సభలో గిరిజన, దళిత మహిళలు ప్రశ్నించిన సందర్భంగా మహిళలను కుక్కల్లాగా పోల్చి మాట్లాడిన సీఎం క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు త్వరలోనే కల్వకుంట్ల కంపెనీకి మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే నిన్ను మట్టుబెట్టడం ఖాయం అంటూ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ హెచ్చరించింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్, అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, దేశినీ సదానందం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, బీజేపీ మహిళా మోర్చా రూరల్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, అర్బన్ జిల్లా నాయకురాల్లు అర్చన, కల్పన, మాధవి, శ్రీదేవి, సులోచన, అపర్ణ, యువమోర్చా జిల్లా నాయకులు కల్లూరి పవన్, గౌతం, రిషివర్ధన్, తదితరులు పాల్గొన్నారు.