వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీదే అధికారం

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ లో మూడు ఊసరవెల్లులు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ లను రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ భూములను, ప్రైవేట్ భూములను కబ్జాలు చేస్తూ అధికార దుర్వినియోగంతో పాటు, ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏప్రిల్ 30న జరుగబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు ప్రచార హోరును కొనసాగించారు. ఇందులో భాగంగానే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారం కొనసాగించారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కొండా సురేఖ , మాజీ ఎంఎల్సీ కొండా మురళీధర్ రావు, వరంగల్ అర్బన్ , రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి లు రోడ్ షో ద్వారా తమ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షో లో భాగంగా రేవంత్ రెడ్డి తో పాటు, కొండా దంపతులు మాట్లాడారు.

ads

తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని టీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుండా మోసం చేయడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడ్డారని, వారికే ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఉద్యమకారులను గెలిపించుకుని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు బుద్ది చెప్పాలని కోరారు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా మూడు గంటల్లో మీ ముందుంటా అని, కార్యకర్తలే పార్టీకి బలమని కొండా దంపతులు అన్నారు. వచ్చే రెండేళ్లలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. తమపై అక్రమంగా పోలీసు కేసులు పెడుతూ రాష్ట్రప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న పోలీసులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి మిత్తితో సహా చెల్లిస్తామని వారు హెచ్చరించారు.