సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్లు ముందుండాలి

వరంగల్ అర్బన్ జిల్లా : కార్పొరేటర్లందరూ ప్రజలందరికీ ఎళ్ళవేళల అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. రానున్న వర్షాకాల సీజన్ ను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ వరంగల్ నగర కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. హన్మకొండలోని అశోక కన్వెన్షన్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. డివిజన్లలోని పలు సమస్యల పరిష్కారం, ప్రారంభమైన వానాకాలంలో డివిజన్లలో సమస్యలు, సీజనల్ వ్యాధులు, అభివృద్ధి పనుల విధివిధానాల రూపకల్పనలకై అనుసరించాల్సిన పద్దతులపై కార్పొరేటర్లతో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చర్చించారు.

ads

ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని సూచించారు. కార్పొరేటర్ల పరిధిలో పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రానున్నది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి‌, గ్రంథాలయ ఛైర్మన్ ఆజీజ్ ఖాన్, కూడా డైరెక్టర్ శివ శంకర్ , నాయకులు సుందర్ రాజ్ యాదవ్, జనార్దన్ మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు.