ఆ ఇద్దరిని ప్రశ్నించిన క్రైం బ్రాంచ్

న్యూఢిల్లీ: 2021, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అరెస్ట్ చేసిన దీప్ సిద్దూ, ఇక్బాల్ సింగ్‎ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు శనివారం ఎర్రకోట వద్దకు తీసుకెళ్లారు. చారిత్రక కట్టడం వద్ద ఆ రోజు జరిగిన సంఘటనలను పున‌:సృష్టించారు. నాటి హింసపై వారిద్దరిని ప్రశ్నించారు.

ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 500 మంది పోలీసులు గాయపడగా, ఒక వ్యక్తి మరణించాడు. నటుడైన దీపూ సిద్దూ ఈ హింసలో కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ బృందం సోమవారం హర్యానాలోని కర్నాల్ బైపాస్ వద్ద దీపూ సిద్దూని అరెస్ట్ చేశారు. మరుసటి రోజు కోర్టులో హాజరుపరుచగా 7 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

రూ.50వేల రివార్డు ఉన్న ఇక్బాల్ సింగ్‎ను పంజాబ్‎లోని హోషియార్‎పూర్‎లో ఈ నెల 9న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రిపబ్లిక్ డే నాటి హింస గురించి వారిద్దరిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.