మే 17న అందుబాటులోకి 2-డీజీ ఫస్ట్ బ్యాచ్

న్యూఢిల్లీ : యాంటీ-కొవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ రేపు విడుదలకానున్నది. కరోనాపై పోరులో కీలకాస్త్రం కానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ డెవలప్ చేసింది. కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి ఈ ఔషధం మొదటి బ్యాచ్ రేపు అందుబాటులోకి రానున్నది. ఫస్ట్ బ్యాచ్ ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ విడుదల చేయనున్నారు. దేశ రాజధానిలోని వివిధ ఆస్పత్రుల్లో 10వేల సాచెట్లను పంపిణీ చేయనున్నారు.

ads

డీఆర్డీఓ తయారు చేసిన 2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్ ( 2-డీజీ ) ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీ) గత వారం అనుమతి ఇచ్చింది. ఈ ఔషధం కొద్దిగా నుంచి ఓ మోస్తరు కరోనా వైరస్ తో బాధపడుతున్న పేషెంట్లపై బాగా పనిచేసింది. ఒకవైపు చికిత్స అందిస్తూనే అచేతనంగా ఈ ఔషధాన్ని ఇవ్వడం వల్ల కరోనా రోగులు వేగంగా కోలుకునే అవకాశాలున్నాయని డీఆర్డీఓ వెల్లడించింది.

అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మంచి ఫలితాలనిచ్చిందని, ఆక్సీజన్ పై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్డీఓ తెలిపింది. ఈ డ్రగ్ పొడి రూపంలో సాచెట్లలో లభిస్తుంది. ఈ పొడిని నీళ్లలో కలుపుకొని తాగడం వలన వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ తెలిపింది.