‘పల్లా’కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి

మహబూబాబాద్​ జిల్లా : పల్లా రాజేశ్వర్​ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. సీఎం కేసీఆర్​కు అన్ని వర్గాల కష్టాలు తెలుసని అన్ని వర్గాలు బాగుండే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కొనియాడారు. శుక్రవారం మహబూబాబాద్ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎంపీ కవితతో కలిసి పాల్గొన్నారు. నల్గొండ – ఖమ్మం- వరంగల్ జిల్లాల టీఆర్​ఎస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యక్ష అనుభవం ఉందన్నారు.

ads

తెలంగాణ వస్తే ఏమి వస్తుందనే వారికి సమాధానంగా నేడు అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి ఉద్ఘాటించారు. గతంలో పెన్షన్ రావాలంటే ఒకరు చనిపోతే గాని ఇంకొకరికి వచ్చేది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి సీఎం కేసీఆర్​ నాయకత్వంలో పెన్షన్ అందజేస్తున్నామన్నారు. తెలంగాణలో మహిళలు బింద పట్టుకొని వెళ్లకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీరు ఇచ్చిన ఘనత సీఎం కేసిఆర్​కే దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు స్థానికంగా కోర్టు లేక దూరం వెళ్లలేక న్యాయం పొందడంలో రాజీ పడుతున్నారు ఇది చాలా బాధాకరం. ఈ పరిస్థితి ఉండకూడదు. అత్యధిక ఎస్టీ జనాభా ఉన్న ఈ మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ కోర్టు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ కోర్టు పెట్టుకోవాలన్నారు.

బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి అనేకం మాట్లాడుతున్నారు. స్థాయికి మించి వ్యక్తులు అన్నా, వ్యవస్థ అన్నా గౌరవం లేకుండా మాట్లాడే సంస్కృతి తెచ్చారని మంత్రి సత్యవతి విమర్శించారు. వీరి వల్ల ఈ ప్రాంతానికి నేరుగా జరిగిన మేలు ఏదైనా ఉందా? విద్యావంతులు మీరే ఆలోచించాలని కోరారు. కాబట్టి ఎవరి వల్ల అభివృద్ధి సాధ్యమవుతుంది అని గుర్తించి వారికి మద్దతుగా నిలబడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా మంత్రిగా నేను, జెడ్పీచైర్​పర్సన్​గా బిందు, ఎంపీగా కవిత, ఎమ్మెల్యే లుగా రెడ్యా నాయక్, శంకర్ నాయక్, హరిప్రియ నాయక్ ఉన్నాము. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మీ సహకారం వల్ల నేడు గొప్ప స్థానంలో ఉన్నాము. ఈ ప్రాంత బిడ్డలుగా ఇక్కడి అభివృద్ధి మా బాధ్యత. రేపు ఏమి చేశామని చెప్పుకునే విధంగా పని చేయాలని నిత్యం ఆలోచిస్తున్నామని తెలిపారు. మన అందరి పోరాటం వల్ల ఏర్పడిన ఈ జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత అందరిదని మంత్రి సత్యవతి రాథోడ్​ సూచించారు.

ఈ జిల్లా వచ్చాక 300 పడకల హాస్పిటల్ మంజూరైంది. మెడికల్ కాలేజీ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రానుంది. మున్సిపాలిటీ అయ్యాక సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. ఇంకా రింగ్ రోడ్డు సాధించుకుకున్నాము అన్నారు. 70 ఏళ్లలో కానిది ఈ 7 ఏళ్లలో చేసుకున్నాం. ఇంకా చేసుకోవాల్సింది ఉంది. ఈ ప్రభుత్వానికి ఇంకో మూడేళ్ల సమయం ఉంది. ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. పోక్సో కోర్టు నా శాఖ పరిధిలో నిదే. దీనిని అభివృద్ధి చేసుకునే బాధ్యత తనకుందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉండాలన్న కోరికలో న్యాయం ఉంది. నేనే మన నాయకులను తీసుకెళ్లి తీసుకొచ్చే కృషి చేస్తానని చెప్పారు. పట్టణ పరిధిలోని ప్రజల అవసరాలు తీర్చడం కోసమే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అన్ని వర్గాల అవసరాలు తెలుసుకుని తీరుస్తున్న ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి సత్యవతి రాథోడ్​ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కౌన్సిలర్ గంగాధర్, టీఆర్​ఎస్​ టౌన్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.