అక్రమ కేసును ఎత్తివేయాలి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సీనియర్ పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్‎పై అక్రమ కేసును ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు. గుడిపల్లి శ్రీనివాస్‎పై అక్కడి పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు రాష్ట్ర మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం కలిపారు. శ్రీనివాస్‎పై అక్రమ కేసును ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డికి వారు వినతి పత్రాన్ని సమర్పించారు.

షాద్ నగర్‎లో నిరుపయోగంగా ఉన్న స్టేడియంలో క్రీడాకారులను అనుమతించాలని స్టేడియం నిర్వాహకులను శ్రీనివాస్ కోరగా, పథకం ప్రకారం స్థానిక పోలీసులు కొందరు ఈ అంశాన్ని వివాదాస్పదం చేసి శ్రీనివాస్ పై 341, 452, 504, 506 సెక్షన్ల క్రింద నాన్ బెయిలెబుల్ కేసు నమోదు చేసి రాత్రికి రాత్రే మహబూబ్‎నగర్ జైలుకు తరలించడం మీడియా లోకాన్ని విస్మయానికి గురిచేసిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. షాద్ నగర్ ప్రాంతంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్‎పై అక్రమంగా నమోదైన కేసును తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం వినతిపై స్పందించిన మంత్రి సబితా వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‎తో ఫోన్లో మాట్లాడారు. జర్నలిస్టులను ఆందోళన కలిగించే ఇలాంటి చర్యలు మంచివి కాదని పేర్కొన్నారు. శ్రీనివాస్‎ను కస్టడీలోకి తీసుకురాదన్నారు. అతనికి వెంటనే బెయిల్ లభించే విధంగా సహకరించాలని సీపీని మంత్రి ఆదేశించారు.  మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.

అనంతరం టీడబ్ల్యూజే ప్రతినిధుల బృందం డీజీపీ మహెందర్ రెడ్డికి, సైబరాబాద్ సీపీకి వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్ట్ శ్రీనివాస్‎పై అక్రమంగా నమోదైన కేసును వెంటనే తొలగించాలని విన్నవించారు.