కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు ఉద్యమమే

వరంగల్ అర్బన్ జిల్లా : కేంద్రప్రభుత్వ మొండి వైఖరి వల్లే కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల్లో ఏ ఒక్క హామీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నెరవేర్చిన దాఖలాలు లేవని వారు మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేందుకు అవసరపడే వనరులను ఏ ఒక్కటి నెరవేర్చలేదని కేంద్ర ప్రభుత్వ తీరుపై దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్ రావు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేసీఆర్ ఎన్నోసార్లు పార్లమెంట్ సాక్షిగా విన్నవించినా కేంద్రం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. పంజాబ్ లో శాంతి ఒప్పందాల్లో భాగంగా వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీని కక్కుర్తితో అటు అటు షిప్ట్ చేశారని అన్నారు. ఇక తమ పార్టీ కార్యకర్త అయిన రవికుమార్ అడిగిన ప్రశ్నకు కోచ్ ఫ్యాక్టరీ కనుచూపుమేరలో కూడా రాదని బీజేపీ సమాధానం ఇవ్వడాన్ని తాము పూర్తిగా నిరసిస్తున్నట్లు దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాష్ తెలిపారు.

ads

అనేక సంవత్సరాల ఉద్యమ నేపథ్యం ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు అంశాలను రాజ్యాంగంలో షెడ్యూల్ 13లోని 8,9,10,11 లో పొందుపరిచినప్పటికీ కేంద్రం నేటికీ వివక్షత చూపిస్తోందని ఎంపీ బండ ప్రకాష్ మండిపడ్డారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని చెప్పారు. 2020 జనవరి20న బోడో ల్యాండ్ ఉద్యమానికి ఉద్యమకారులకు ఒక హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో మాత్రం లేని హామీలు ఇవ్వకుండా, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు. ఒక పార్లమెంట్ చట్టాన్ని బలపరిచినప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టాలని ఎంపీ బండ ప్రకాష్ హెచ్చరించారు. ఇక రైల్వే బడ్జెట్ లో నిధుల కేటాయింపుల విషయంలో కూడా తెలంగాణలో వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి పోయే పన్నుల శాతంతో పోల్చుకుంటే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధులు 41% మాత్రమేనని తెలిపారు. ఇక నిజామాబాద్ లో పసుపుబోర్డు ఇవ్వడం చేతగాని కేంద్రం , ఎన్నికల స్టంట్ లో భాగంగా తమిళనాడులో పసుపుబోర్డు పెడతామనడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కూడా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారని, ఇక మరో ఉద్యమానికి మేం సిద్ధమని పిలుపునిచ్చారు. మీడియా కూడా తెలంగాణ ఉద్యమంలో సహకరించిన విధంగా కోచ్ ఫ్యాక్టరీ సాధనలో కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు విన్నవించారు.