మొక్కలు పెంచడం మన బాధ్యత

హైదరాబాద్​ : మొక్కలు పెంచడం మన వ్యక్తిగత బాధ్యత అని ఆర్థిక మంత్రి హరీశ్​రావు అన్నారు. గురువారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 9 వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

‘దేశవ్యాప్తంగా ఉన్న 120 స్టాల్స్ ను హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగర వాసుల కోసం ఈ నర్సరీ మేళాలో ఏర్పాటు చేసినట్టు మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. తీరిక లేని పనులతో ఉండే నగర వాసులు ఇంట్లో మొక్కలు పెంచితే పని ఒత్తిడిని జయిస్తారని మంత్రి తెలిపారు. మొక్కలు ఆనందాన్ని, మానసికోల్లోసాన్ని కలుగ జేస్తాయన్నారు. ఈ నర్సరీ మేళాలో ఆర్గానిక్, బోన్సాయ్, ఔషధ, అన్ని రకాల పూల, పండ్ల మొక్కలు ఉన్నాయని వెల్లడించారు. మొక్కలతో పాటు వీటికి‌ సంబంధించిన అన్ని రకాల పని ముట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని మంత్రి హరీశ్​రావు వివరించారు. మన పిల్లలకు ఆస్థి ఇస్తే‌ నిలుపుకుంటారో లేదో కాని మంచి పర్యావరణాన్ని ఇస్తే వాళ్లకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చినట్లే మంత్రి సూచించారు.

డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం పోతే తిరిగి రాదు. మంచి పర్యావరణం తోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉందని మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తించే హరితహారం, సామాజిక అడవుల పెంపకం, అర్బన్ ఫారెస్ట్, పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి అభిప్రాయపడ్డారు.

నగర, పట్టణ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పది శాతం పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఉద్ఘాటించారు. వాటర్ బాటిల్స్ కొనడం మనం చూస్తున్నాం. మనం మొక్కలు పెంచకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ బాటిల్స్ కొనాల్సి వస్తుందేమోనని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్ వంటి మంచి ట్రెండ్ నగరవాసులు పాటిస్తున్నారు. ఇది అందరూ విధిగా పాటించాలి. పిల్లకు మొక్కలు పెంచడం నేర్పాలి’ అని మంత్రి హరీశ్​రావు కోరారు.