సాగర్‎లో ఎగిరేది గులాబీ జెండానే

సూర్యాపేట జిల్లా: ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపి, కాంగ్రెస్‎లు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్‎యస్ విజయదుంధుబి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రూ.251.50 లక్షల అంచనా వ్యయంతో సూర్యాపేట పురపాలిక సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు బుధవారం రోజున ఆయన శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా 19 వ వార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒక్క సీటు గెలిచి ఎగిరెగిరి పడుతున్న పార్టీకీ సాగర్‎లో డిపాజిట్ కూడా రాదని ఆయన తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‎యస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే రైతుబందు,రైతుభీమా,కళ్యాణలక్ష్మి/షాది ముబారాక్ వంటి విప్లవాత్మకమైన పథకాలకు అంకురార్పణ జరిగిందని ఆయన అన్నారు. అటువంటి పథకాల ఆలోచన బీజేపి కాంగ్రెస్‎లు ఇంకా వందేండ్లు పాలించినా రావని ఆయన దెప్పి పొడిచారు. బీజేపి పాలిత రాష్ట్రాలలో ఆ పథకాలు ఎందుకు ప్రవేశ పెట్టలేదో ఆ పార్టీ తేల్చి చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రధాని హోదాలో మోడీ దేశప్రజలకు చేసింది ఏమి లేదని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వస్తే స్కాంలు, స్కీమ్‎లతో కాంగ్రెస్ గడించిన నల్లడబ్బును ప్రజల ఎకౌంట్‎లో వేస్తామని ఇచ్చిన మాట ఏమైందని ఆయన ప్రధాని మోడీకి ప్రశ్నలు వదిలారు. సూర్యాపేట అభివృద్ధి గురించి మాట్లాడే నైతికత విపక్షాలకు ఎక్కడిదని ఆయన ధ్వజమెత్తారు. నిజంగా అభివృద్ధి గురించి చర్చకు వస్తే బహిరంగ చర్చకు సిద్ధమేనన్నారు. 2014 కు ముందు వరకు ఏలిన పార్టీలు పెంచి పోషించిన రౌడీయిజాన్ని గడిచిన ఏడేండ్లుగా కట్టడి చేసింది నిజం కాదా అని ఆయన నిలదీశారు. అభివృద్ధికి పర్యాయపదం అనేది ఉంది అంటే అది సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.

2014 తరువాత జిల్లా కేంద్రంగా సూర్యాపేట రూపాంతరం చెందడమే ఇందుకు చక్కటి ఉదాహరణ అని మంత్రి జగదీష్ రెడ్డి నిర్వచించారు. ఆమడ దూరంలో కలెక్టరేట్, నగరం నడిబొడ్డున మెడికల్ కాలేజీ లు అభివృద్ధికి దిక్సూచిలుగా ఆయన అభివర్ణించారు. అటువంటి అభివృద్ధి పై చర్చకు పోకుండా ప్రజలను గందరగోళంలోకి నెట్టేందుకు, ప్రజలకు సంబంధంలేని అంశాలను తెరమీదకు తెచ్చి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బీజేపీ ,కాంగ్రెస్‎లను ఓ కంట కనిపెట్టాలని ప్రజలకు ఆయన సూచించారు. సంక్షేమాన్ని,అభివృద్ధి ని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తుంటే ప్రజలు తమను ఎక్కడ మరచి పోతారన్న భయం తోటే భావోద్వేగాలతో రెచ్చగొట్టి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అటువంటి ఎత్తుగడలను తిప్పిగొట్టి అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ అధ్యక్షత వహించిన ఈ సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.