జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాజ్ పథ్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల దృష్ట్యా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు అంజలి ఘటించారు. రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి జాతీయ యుద్ధ స్మారకం వద్దకు వచ్చిన మోడీకి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శకటాలు…
కరోనా నిబంధనల కారణంగా ఈ సారి వేడుకల్లో కాస్త ఆర్భాటాలు తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ త్రివిధ దళాల సైనిక పాటవాల ప్రదర్శన, శకటాల రూపంలో ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగాయి. ఇటీవల భారత అమ్ములపొదిలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలు, అయోధ్య రామమందిర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.