గోదావరి జలాల విడుదలకు ముహూర్తం ఖరారు

కాకినాడ : గోదావరి ఆయకట్టు కాల్వలకు జూన్ 15వ తేదీ నుండి సాగునీరు విడుదల చేయనున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకాగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి విజయవాడ నుండి గురువారం జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణగోపాల కృష్ణ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో మంత్రులు తొలుత ఇరిగేషన్ అధికారులతో పోలవరం పనులు దృష్ట్యా గోదావరి కాల్వలకు సాగునీరు అందించే తేదీ గురించి సమీక్షించి అప్ స్ట్రీమ్ కాఫర్ డాం క్లోజ్ చేసి జూన్ 15వ తేదీ నుండి నీరు విడుదల చేయాలని నిర్ణయం చేసారు. అలాగే జూన్ 15 లోపు ఉభయ గోదావరి జిల్లాల్లో త్రాగునీటి అవసరాలపై జరిపిన సమీక్షలో తూర్పు గోదావరి జిల్లాలో సమ్మర్ స్టోరేజి చెరువులన్నిటినీ కాలువల మూసివేత నాటికి పూర్తి స్థాయికి నింపినందున త్రాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేశారు.

ads

అయితే నీటి విడుదల తేదీ లోపున పశ్చిమగోదావరి జిల్లాలో త్రాగునీటి ఇబ్బంది ఎదురు కానుందని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలియజేయగా, బ్యారేజి నుండి త్రాగునీటి అవసరాల మేరకు ముందస్తు నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు కాలువలు తిరిగి తెరిచే లోపు మంజూరు చేసిన క్లోజర్ నిర్వహణ, అభివృద్ది పనులన్నిటినీ పూర్తి చేయాలని కోరగా, క్లోజర్ పనులను ప్రాధాన్యతగా చేపట్టి ముమ్మరంగా నిర్వహించాలని మంత్రులు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు వంగా గీత, చింతా అనూరాధ, శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, జక్కంపూడి రాజా, ఇరిగేషన్ సిఈ సుధాకర్, ఎస్ఈ ఆర్.శ్రీరామకృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.