రెండో విడత గొర్రెల పంపిణీకి రూ. 6వేల కోట్లు

హైదరాబాద్ : రాష్ట్రంలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న క్రమంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి, కార్యాచరణ చేపట్టిందని సీఎం పేర్కొన్నారు. అందులో భాగంగానే అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ads

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ. 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టగా , అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ. 6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న గొర్రెల యూనిట్ ను అదే సంఖ్యలో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.