స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు !

స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుకు సుముఖం !

హైకోర్టుకు తెలపనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
అఫిడవిట్‌ సమర్పణకు సన్నాహాలువరంగల్ టైమ్స్, హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ దాఖలైన పిటిషన్లపై వైఖరిని తెలియజేస్తూ మూడు నెలల్లో అఫిడవిట్‌ను సమర్పించాలని గత ఏడాది సెప్టెంబర్‌లోనే హైకోర్టు ఆదేశించింది. దాంతో రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి ఇంతవరకు చేసిన ప్రయత్నాలను వివరిస్తూ ప్రమాణ పత్రాన్ని అందజేయనుంది.

బీసీల రిజర్వేషన్ల పెంపుదలపై సుముఖంగా ఉన్నట్టు తెలపనుంది. బీసీల లెక్కలను తేల్చేందుకు చేపట్టిన కులసర్వే, అందులో తేలిన కులాల వివరాలు, బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ను నియమించడం, అది ఇచ్చిన నివేదిక ఆధారంగా శాసనసభలో బిల్లులను పెట్టి ఆమోదించడం, ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపడం తదితర విషయాలను వివరించనుంది.

ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్ల పరిస్థితిని కూడా ప్రస్తావించనుంది. ఎస్సీలు, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండగా, బీసీలకు సుమారు 23శాతం అమలవుతున్నాయి. అందువల్ల బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది.

ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేసినా, అసలు దానిని పరిగణలోకి తీసుకోకున్నా..కోర్టులో వచ్చే నిర్ణయాన్నే అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించి మొత్తం రిజర్వేషన్లు ఉండకూడదన్న అంశాన్ని ఉద్ఘాటిస్తే గత ఎన్నికల్లో అమలైన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎన్నికల్లో మాట ఇచ్చినందున పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.