డీజిల్​ లేక దొరికిపోయారు

కృష్ణా జిల్లా : ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషన్ల లోడు గల వ్యాన్​ను దొంగల ముఠా హైదరాబాద్​కు తరలించాలని మాస్టర్​ ప్లాన్​ వేసింది. అయితే మార్గమధ్యలో వ్యాన్​లో డీజిల్​ అయిపోవడంతో వారి కథ అడ్డం తిరిగింది. దీంతో చేసేదేమీ లేక డీజిల్​ డబ్బుల కోసం ఎల్​ఈడీటీవీలను రూ.500కు బేరం పెట్టారు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి చోరీ వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.

ads

ఏపీ లోని కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడు లో సోనోవిజన్ షో రూమ్‌ ఉంది. అక్కడి నుంచి భీమవరానికి ఎల్‌ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌ మెషన్లు ఓ మినీ వ్యాన్‌లో లోడ్‌ చేశారు. అయితే ఈ వ్యాన్‌ పై యూపీకి చెందిన ఓ దొంగల ముఠా కన్నేసింది. ఇంకేముంది వెంటనే చాకచక్యంగా చోరీ చేసేశారు. వ్యాన్‌ను ఎవరికి అనుమానం రాకుండా ఎనికేపాడు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్లిపోవాలని మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. అయితే మార్గమధ్యలో కథ అడ్డం తిరిగింది.

వ్యాన్‌లో డీజిల్‌ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. వ్యాన్‌లో చూస్తే లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి. దీంతో చేసేదేమి లేక డీజిల్‌ డబ్బుల కోసం ఎల్‌ఈడీ టీవీనీ రూ.500లకు బేరం పెట్టారు. ఇలా బేరం పెట్టడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని పట్టుకున్నారు.

చోరీ చేసిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల విలువ రూ.9 లక్షల వరకు ఉంటుంది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు సోనోవిజన్‌ యజమాన్యానికి సమాచారం అందించారు. లక్షలాది విలువ చేసే ఎలక్ట్రానిక్‌ వస్తువులు దొరకడంతో షోరూమ్‌ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అయితే భారీ ప్లాన్‌ వేసి పట్టపగలే దొంగతనం చేసిన యూపీ ముఠా డీజిల్‌కు డబ్బులు లేక అడ్డంగా దొరికిపోయారు.