విమర్శలు చేసే ముందు ఆలోచించాలి


కామారెడ్డి జిల్లా : విమర్శలు చేసేముందు ప్రతిపక్షాలు ఆలోచన చేయాలని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డితో కలిసి స్పీకర్​ పోచారం శంకుస్థాపన , భూమి పూజ చేశారు.

దేశంలోని ప్రతి ప్రాంతంలో రైతులు, పేదలు ఉంటారు. ఈ రెండు వర్గాల అభివృద్ధి గురించి ఆలోచనలు చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్​ అన్నారు. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే ఈ రెండు వర్గాల సంక్షేమం గురించి ఆలోచన మొదలైందని స్పీకర్​ కొనియాడారు. ప్రజల ఆకలి తీర్చేది రైతులు . అయితే దేశాన్ని కాపాడేది సైనికులు అన్నారు. అందుకే వీరిద్దరిని కాపాడుకోవాలని స్పీకర్ పోచారం చెప్పారు. రాష్ట్ర జనాభాలో 60 శాతం రైతు కుటుంబాలు ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో 70,797 కుటుంబాలు ఉంటే అందులో 61,583 రైతు కుటుంబాలు ఉన్నాయి. అంటే 85 శాతానికి పైగా రైతు కుటుంబాలు ఉన్నాయని స్పీకర్​ పేర్కొన్నారు.

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో రూ. 300 కోట్లతో రోడ్లు, బ్రిడ్జి లను నిర్మించాం. మంజీర నదిపై చెక్ డ్యాం నిర్మాణం ఈ ప్రాంత వాసుల కల. సీఎం కేసీఆర్ దయతో నేడు అది తీరుతుంది తెలిపారు స్పీకర్​ పోచారం. కొందరు నాయకులు తలా తోక లేకుండా మాట్లాడుతారు.
రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని ఉద్ఘాటించారు. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు కరంటును ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే స్పీకర్​ కొనియాడారు.

ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణంతో మంజీర నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. మంజీర నదిపై బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నాలుగు చెక్ డ్యాం ల నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్మిస్తుందని స్పీకర్​ పోచారం వెల్లడించారు. ఈ చెక్ డ్యాం ల నిర్మాణంతో వానాకాలంలో వచ్చే వరద నీరు ఇక్కడ ఆగి చుట్టు పక్కల ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో రైతులకు ఇబ్బందులు ఉండవని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రాణహిత నది నుంచి నీటిని తీసుకుని రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువ గోదావరి లోకి పంపుతున్నారు. ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి హల్ధీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి నీళ్లను పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే ఇంకో పది, పదిహేను రోజుల్లో గోదావరి నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి వస్తాయన్నారు. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం అందుతుందని వివరించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులోని భూములకు ఏటా రెండు పంటలకు ఢోకా లేదన్నారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు అని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ ఎ శరత్, మండల అధ్యక్షురాలు దొడ్ల నీరజావెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ సభ్యురాలు పద్మ గోపాల్ రెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘ చైర్మన్ జంగం గంగాధర్, పీఏసీఎస్​ అధ్యక్షుడు ఎర్వ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, భూషణ్ రెడ్డి, రైతులు, ప్రజాప్రతినిధులు, సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.