ఈ క్రెడిట్ కేటీఆర్‎కే :ఎర్రబెల్లి

హైదరాబాద్: దేశంలో అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ , మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే దేశంలో 100 శాతం ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చిన మొదటి రాష్ట్రంగా ప్రకటించిన కేంద్రం తాజాగా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో 100 శాతం నల్లా కనెక్షన్లను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ఆశ్రమాల్లో 100 శాతం నల్లా కనెక్షన్లు కల్పించాలని గతేడాది గాంధీ జయంతిని పురస్కరించుకొని 200 రోజుల ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

బడిపిల్లలు కలుషిత నీరు తాగి వ్యాధుల బారిన పడడం, కరోనా నివారణలో పదేపదే చేతులు కడుక్కునే అవసరం ఉన్నందున, పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్ధిష్ట సమయంలో ఈ ప్రణాళికను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ , తమిళనాడు, గోవా, హర్యానా రాష్ట్రాల్లో పూర్తి చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ వివరాలను వెల్లడించింది. ఈ మిషన్ అమలుకు మరింత సమయం కావాలని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సూచించాయ. రాష్ట్రాల సూచన మేరకు 100 రోజుల ప్రణాళిక ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చి 31 వరకు పొడిగించింది.

సీఎం కేసీఆర్, మొదట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన మంత్రి కేటీఆర్ లకే ఈ క్రెడిట్ దక్కుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు దక్కించుకున్న మిషన్ భగీరథ పథకం మరో ప్రశంసను పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచన, ముందు చూపు, చొరవ, తెగువ వల్లే ఇది సాధ్యమైందన్నారు. అవార్డులు, ప్రశంసలతో పాటు కేంద్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి నిధులు కూడా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.