ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

మహబూబాబాద్ జిల్లా : తొర్రూరుని మున్సిపాలిటీని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్ని కోట్లు అయినా వెచ్చించడానికి వెనుకాడని స్పష్టం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సుధాకర్‎రావు సహకారంతో యతి రాజారావు పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని మంత్రి తెలియజేశారు.

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూర్‎లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొర్రూరు రైతు సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. తొర్రూరులోనే పల్లె ప్రకృతి వనం, తొర్రూరులోని అన్నారం షరీఫ్ క్రాస్‎రోడ్డు వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్‎ని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అన్నారం షరీఫ్ క్రాస్ రోడ్ నుంచి నుంచి నేరుగా ర్యాలీగా కాలి నడకన వెళ్లి యతిరాజరావు పార్క్ లో ఓపెన్ జిమ్‎ని , తర్వాత ఎల్‎వై‎ఆర్ గార్డెన్స్ టేస్టీ ఫుడ్ కోర్టుని, ఆపై అమూల్య ఫిజీయో థెరపీ హాస్పిటల్‎ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం 14 మందికి 14 లక్షల 1,624 విలువైన కళ్యాణ‎లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 12 మందికి రూ. 4లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పొడిశెట్టి శ్రీనివాస్ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోగా, పార్టీ తరపున రూ. 2లక్షల భీమా చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అతని భార్య రామతారకు అందచేశారు.

తర్వాత తొర్రూరు మున్సిపాలిటీ మొదటి వార్షికోత్సవ సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభలో భాగంగా మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. మార్చి తర్వాత కౌన్సిలర్‎లకు వార్డుల అభివృద్ధి కోసం ఒక్కో వార్డుకు రూ.50 లక్షలు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవాలని ,నేనున్నాననే భావన కలిగించాలి అని అన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రైతాంగం సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తద్వారా ఎస్సారెస్పీ ప్రాజెక్టు కాలువల ద్వారా వ్యవసాయ సేద్యానికి నీరు అందిస్తున్నామన్నారు. రూ. 45 వేల కోట్లు వెచ్చించి సురక్షితమైన త్రాగు నీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చామని, మిగతా మినరల్ వాటర్ కంటే, మిషన్ భగీరథ బాటిల్ వాటర్ ఎంతో ఆరోగ్యదాయకం అని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ మినరల్ బాటిల్ వాటర్‎ను మంత్రి ఆవిష్కరించారు.

అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మహిళలు కోలాటాలు, బతుకమ్మలు, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. యతి రాజారావు స్మారక పార్కులో మంత్రి, కలెక్టర్, అదనపు కలెక్టర్‎లు కొద్దిసేపు ఉయ్యాల ఊగి సేదతీరారు.

ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ వి.పి. గౌతమ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, ఎంపీపీ అంజయ్య, జడ్పిటిసి శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్, గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, ఎమ్మార్వో రాఘవ రెడ్డి, ఎంపీడీవో భారతి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.