రాష్ట్రానికి ట్రైబల్​ రెసిడెన్షియల్​ లా కాలేజీ

మంత్రి సత్యవతి రాథోడ్​కు మంజూరు పత్రాలు అందించిన గిరిజన శాఖ అధికారులుహైదరాబాద్​ : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ శాఖలో కొత్తగా పలు విద్యా సంస్థలు మంజూరవుతున్నాయి. తాజాగా తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. 60 మందికి ఇందులో సీట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో విడత లా కౌన్సెలింగ్ లో ట్రైబల్ రెసిడెన్షియల్ లా కాలేజీలో గిరిజన, ఇతర విద్యార్థులు సీట్లను పొందే అవకాశం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ లా కోర్సుగా ఈ కాలేజీకి మంజూరు లభించింది. గ్రాడ్యుయేషన్ గా కొనసాగే ఈ కోర్సులో 5 సంవత్సరాల న్యాయ విద్య ఉంటుంది.ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ లా కాలేజీలోని 60 సీట్లలో 39 సీట్లు గిరిజనులకు,6 దళితులకు, 7వెనుకబడిన తరగతులకు , రెండు అగ్రవర్ణాలకు, రెండు క్రీడా విభాగం, రెండు ఎన్సీసీ విభాగం, మరొక సీటు ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకో సీటు వికలాంగుల కోటా కింద కేటాయించారు.

ఇటీవలే వరంగల్ లోని నర్సంపేటలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సైనిక్ స్కూల్ ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. డిఫెన్స్ ఆధ్వర్యంలో కాకుండా బయట ఉన్న ఏకైక సైనిక్ స్కూల్ గా ఇది రికార్డు సాధించింది.అదేవిధంగా కెమిస్ట్రీలో ట్రైబల్ పీజీ ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు రెండింటికి కూడా మంజూరు లభించింది. ఇందులో జడ్చర్లలో బాలురకు 40 సీట్లు, షాద్ నగర్ లో బాలికలకు 40 సీట్లు ఇంటిగ్రేటెడ్ పీజీ ఎమ్మెస్సీ కోర్సులో మంజూరు అయ్యాయి.

వీటితో పాటు మరో రెండు కాలేజీల మంజూరుకు అనుమతి లభించాల్సి ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 వల్ల ఈ రెండు కాలేజీల అనుమతి ఇప్పటికే రావాల్సి ఉన్నా రాలేదని అధికారులు మంత్రికి వివరించారు. వీటిలో ఒకటి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీ ఎడ్), మరొకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020 ప్రకారం బీఎడ్​ను ఇకపై నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేయడంతో త్వరలో గిరిజన శాఖకు ఈ ఇంటిగ్రేటెడ్ బీఎడ్​ కాలేజీ రానుందని మంత్రి సత్యవతి రాథోడ్​ వివరించారు.