దాడులకు ప్రతిదాడులు

వరంగల్ అర్బన్ జిల్లా : హన్మకొండలో పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చల్లా ధర్మారెడ్డి ఇంటిని ముట్టడించిన బీజేపీ శ్రేణులు ఆయన నివాసంపై రాళ్లతో, పోలీసుల లాఠీలతో దాడి చేసి, ఇంటి అద్దాలను పగులగొట్టారు. అయోధ్య రామమందిర నిర్మాణానికై జన జాగరణ నిధి సేకరణ కార్యక్రమంపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఎమ్మెల్యే చల్లా వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ శ్రేణులు చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి చేశారు.ప్రతిగా టీఆర్ఎస్ శ్రేణులు హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంపై రాళ్లతో రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో బీజేపీ నాయకుల పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో మండిపడిన బీజేపీ శ్రేణులు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో సుబేదారి పీఎస్ లో నిరసన దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలని, దాడులకు దిగుతున్న టీఆర్ఎస్ గుండాలను శిక్షించాలంటూ సుబేదారి పోలీస్ స్టేషన్ లో రావు పద్మ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో నష్టపోయిన తమ ఆస్తులకు , ధ్వంసమైన తమ వాహనాలకు నష్టపరిహారం కల్గించాలని బీజేవైఎం వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు సిద్ధం నరేష్ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అయోధ్య రామమందిర నిధి సేకరణపై చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లాలో అలజడిని సృష్టించాయి. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నారు. అటు ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ , సత్యవతి రాథోడ్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బీజేపీకి ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చిల్లర రాజకీయాలు చేయద్దంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా బీజేపీ శ్రేణులను హెచ్చరించారు.

టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల విమర్శలకు మండిపడుతూ ఇస్తూ బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ,బీజేపీ సీనియర్ నేతలు, బీజేవైఎం నేతలు టీఆర్ఎస్ అధికార పార్టీకి కౌంటర్లు ఇచ్చారు. అయితే ఆదివారం జరిగిన ఈ ఘటనల్లో అటు చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడి, ప్రతిగా ఇటు బీజేపీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణుల దాడుల్లో పోలీసుల మోహరింపును సైతం నిరసనకారులు చేధించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు రంగం ప్రవేశం చేసిన పోలీసులను సైతం నిరసనకారులు తిప్పలు పెట్టారు. పోలీసుల చేతుల్లో లాఠీలను సైతం లాక్కుని దాడులకు దిగారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సుమారు కొన్ని గంటల పాటు నిరసనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి.