కాజీపేట కోచ్‎ఫ్యాక్టరీ కోసం మరో సమరం

వరంగల్ అర్బన్ జిల్లా : ఉపాధి లేక ఇప్పటికే రోడ్డున పడిన ఎంతో మంది రైల్వే కార్మిక కుటుంబాలు, నిరుద్యోగులు ఎన్నో యేండ్లుగా ఎదురుచూస్తున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం వివక్షత బయటపడిందని ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. హన్మకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు.

ads

తెలంగాణ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూమిని కేటాయించినప్పటికీ, తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ రాష్ట్ర, జిల్లా నేతలు ఎన్నో తప్పుడు కూతలు కూశారని వినోద్ కుమార్ దుయ్యబట్టారు. 2001 ఏప్రిల్ 7న ఆవిర్భవించిన టీఆర్ఎస్ వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలన్న డిమాండ్‎తో ప్రజలను చైతన్యపర్చడమే కాకుండా పార్లమెంట్ వేదికగా అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా తమ గళాన్ని వినిపించారని , ప్రధాన మంత్రి, కేంద్ర సహాయ రైల్వే శాఖ మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా తెలిసిందని, దానిని సాధించేందుకు మరో సమరం తప్పదని ఆయన వెల్లడించారు.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ విభజన చట్టంలో పొందుపర్చారని, ఆ హామీలను సైతం బీజేపీ అమలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేను ప్రైవేటీకరణ చేసేందుకే కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదంటోందన్నారు. రైల్వేను అంబానీ, అధానీ చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతుందన్నారు. రాష్ట్రానికి మేలు చేసే పనులు చేసే ఆలోచన ఉండాలే తప్ప, వచ్చే ఫ్యాక్టరీలను రాకుండా చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, జిల్లా నేతలు కుట్ర తెలిసిపోయిందని అన్నారు.. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా బీజేపీ రాష్ట్ర నేతలు అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. పైగా కాళేశ్వరంకు డీపీఆర్ ఇవ్వలేదు అని అసత్య ప్రచారాలు చేస్తున్న బండి సంజయ్ పిచ్చి కూతలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు కలిసి వచ్చే పార్టీలతో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.

వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నూతన చట్టాలను తీసుకు వచ్చి రైతు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్న కేంద్రానికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. టీచర్లకు సంబంధించిన సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి న్యాయమైన డిమాండ్‎లను పరిష్కరుస్తామని వినోద్ కుమార్ అన్నారు. అందుకే ఆలోచించి పట్టభద్రులంతా టీఆర్ఎస్ అభ్యర్థినే ఎమ్మెల్సీగా గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండా ప్రకాష్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.