టీఆర్ఎస్ త్యాగాలతో నిలిచిన పార్టీ

నిజామాబాద్: త్యాగాలతో మొదలైన చరిత్ర, భారత దేశ ముఖ చిత్రాన్ని మార్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. దేశ ముఖ చిత్రాన్ని మారుస్తూ దేశంలోనే వరి ధాన్యంలో రెండో స్థానంలో మన రాష్ట్రం ఉందని అన్నారు. ఇక్కడ వ్యవసాయానికి మనం అందిస్తున్న సహకారం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. మొదటి నుంచి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.

జలదృశ్యంలో కేసీఆర్ పార్టీ ప్రారంభించినప్పుడు అనేక మంది ఉద్యమకారులు అండగా నిలిచారని అన్నారు. చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పార్టీకి జాగాలేకుండా విశ్వప్రయత్నం చేశారు. అయినా పిడికెడంత మందితో ప్రారంభమైన పార్టీ ఈ రోజు చరిత్రను తిరగరాస్తుందంటే అది కార్యకర్తల బలమేనని కవిత కొనియాడారు. చిన్న మొక్కలా ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మహావృక్షంలా మారిందంటే కారణం బలమైన, నమ్మకమైన కార్యకర్తలు ఉండటం వల్లనే అని అన్నారు. బాధల్లో ఉన్న కార్యకర్తలను నాయకులు ఎప్పుడు మర్చిపోకూడదని, నాయకులకు మొట్టమొదటి ఆప్తుడు గులాబీకండువా వేసుకున్న కార్యకర్తలేనని అన్నారు.

పార్టి నిర్మాణంలో కార్యకర్తలు చెమట ,రక్తం చిందించారు. పార్టి బాగుంటే పదువులు వరిస్తాయని మరచిపోకూడదని ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ కార్యకర్తలపై ప్రేమతో సభ్యత్వ నమోదులో భీమా పథకం తెచ్చారు. పార్టీని నమ్ముకున్న ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని కవిత పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కార్యకర్తలకు గట్టిగ బుద్ధి చెప్పాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని కార్యకర్తలకు వివరించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిందన్నారు.