జనగామ జిల్లా : తెలంగాణ ఆత్మగౌరవం సర్వాయి పాపన్న అని ఎక్సైజ్, ప్రొహిబిషన్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని కొడకండ్ల మండలం రామవరంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు.
‘తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్దార్ సర్వాయి పాపన్న. పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. పాపన్న ఆత్మగౌరవానికి ప్రతీక. గౌడ కులానికే కాదు మొత్తం తెలంగాణకే గర్వకారణమని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు. అతి సామాన్యమైన జీవితం నుంచి అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ఓ కల్లుగీత కార్మికుడు సైన్యాన్ని సమకూర్చుకుని రాజులను ఎదురించి, యుద్ధాలు చేసి, రాజ్యాలను స్థాపించి పరిపాలించడం చరిత్రలో ఓ అరుదైన విషయమని మంత్రులు చెప్పారు.
నాటి సర్వాయి పాపన్న యాధృచ్చికంగా జరిగిన ఓ ఘటన నుంచి సొంత సైన్యాన్ని సమకూర్చుకుని నాటి రాజుల సైన్యాన్ని ఎదురించారన్నారు. మొఘలాయిలను ఎదురించిన మొట్టమొదటి తెలంగాణ రాజు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రులు ఎర్రబెల్లి , శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. అనంతరం 33 రాజ్యాలను స్థాపించారన్నారు. జీవించినన్నీ రోజులూ రాజుగానే జీవించాడన్నారు. అలాంటి అద్భుత వ్యక్తి మన తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శ ప్రాయుడని మంత్రులు కొనియాడారు. నాటి సర్వాయి పాపన్న రాజ భవనాలను కాపాడే పనిని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నదన్నారు. వాటి సంరక్షణకు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్ వివరించారు.
సీఎం కేసీఆర్ కూడా సర్వాయి పాపన్న స్ఫూర్తిగా, బడుగుల ఆశాజ్యోతిగా, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. బడుగుల విద్యా వ్యాప్తికి గురుకులాలను ప్రారంభించారన్నారు. బడుగుల ఆత్మగౌరవ ప్రతీకగా హైదరాబాద్ లో అన్ని కులాల సామాజిక వర్గాలకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తున్నారని మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కులాల, కుల వృత్తుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. గొర్లు, బర్రెలు, చేపలు ఇలా అనేక అంశాలను ప్రభుత్వమే చేపట్టిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో బడుగులకు, స్త్రీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దేనని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు.
బడుగుల ఆశాజ్యోతి అయిన సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలకు దేశ వ్యాప్తంగా గౌరవం, అవార్డులు, రివార్డులు దక్కుతున్నాయన్నారు. అలాగే కల్లుగీత వృత్తిని సైతం గౌరవ ప్రదమైన స్థానంలో నిలిపిన ఘతన సీఎం కేసీఆర్ దేనని మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ లు సంతృప్తి వ్యక్త పరిచారు.
ఈ కార్యక్రమంలో పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులను, సీఎంఆర్ ఎఫ్ చెక్కులని అందచేశారు. అలాగే విగ్రహ ప్రతిష్టాపన కమిటీని మంత్రులు సత్కరించగా, అందుకు ప్రతిగా మంత్రులని కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ గౌడ సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నేతలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.