మనకు సారూ, కారే ముఖ్యం

వరంగల్ : ఇంటికైనా మట్టి కైనా మనోడే ఉండాలి. మన కేసీఆర్‎కు ఉండే ఆర్తి మరో పార్టీకి ఉంటుందా? పద్నాలుగేళ్లు కొట్లాడి, చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారు. అనేక అవార్డులు రివార్డులు ఇందుకు సాక్ష్యం. అవార్డులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నయాపైసా ఇవ్వడం లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కిట్లు… ఇలా పథకాలన్నీ మనవి. మన రాష్ట్రానికి కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా కేంద్రం ఇచ్చిందా? బీజేపీకి ఓటు వేస్తే, జై భారత్ జై యూపీ జై గుజరాత్ అంటారు. అదే మన సారుకు, మన కారుకు ఓటేస్తే, జై భారత్ జై తెలంగాణ అంటారు. పువ్వుకు ఓటేస్తే మన చెవుల్లో పువ్వే. కలిసికట్టుగా పని చేయడం ముఖ్యం విజయం తనంతటతానే రావడం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్- ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా సోమవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కేంద్రాలలో పట్టభద్రుల తో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, టిఆర్ఎస్ పార్టీ అవసరం, కేంద్రం, బిజెపి వైఖరి, అభివృద్ధి-సంక్షేమ పథకాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పట్టభద్రులకు వివరించారు. పట్టభద్రులు అంటే చదువుకున్న ఓటర్లని, విచక్షణతో వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. మంచి చెడులను ఎంచి చూడాలి. పార్టీలు, రాజకీయాలు, ప్రభుత్వాలు, అవి చేసే అభివృద్ధి, సంక్షేమాలను చూడాలి. ఆ తర్వాత నిర్ణయించుకోవాలి అని మంత్రి పట్టభద్రులకు వివరించారు.

ఇక నియోజకవర్గంలో సాధించాల్సిన విషయాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరించారు. ఉపాధి శిక్షణ ఉద్యోగాలు విద్య, వైద్యం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంశాలను ఆయన పట్టభద్రులకు వివరించారు.

ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్, జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, మేయర్ గుండా ప్రకాష్ రావ్, కన్నెబోయిన రాజయ్య, పలువురు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు, తదితరులు పాల్గొన్నారు.