సాగునీటి పనులకు అనుమతులు

హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలు, కాలువల ఆధునీకరణ, సీసీ లైనింగ్ పనులకు ప్రభుత్వం శనివారం పరిపాలనీ అనుమతులు ఇచ్చింది. పనుల నిర్వహణకు రూ.1,217.21 కోట్లను కేటాయించింది. ముక్త్యాల, జాన్ పహాడ్ బ్రాంచ్ కాల్వలకు, సాగర్ ఎడవ కాలువ సీసీ లైనింగ్ పనులకు సర్కారు ఆమోదం తెలిపింది. నిధులు విడుదలతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవస్థపై సీఎం కేసీఆర్ నిన్న నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్‎లో సుధీర్ఘంగా చర్చించారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నెల్లికల్లు లిఫ్టుతో పాటు మరో 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ ఈ నెల 10న నియోజకవర్గం తిరుమలగిరి మండలం నెల్లికల్‎లో ఒకేచోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.