దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

విశాఖ జిల్లా : దారి దోపిడీకి పాల్పడుతున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 12, 13, ఫిబ్రవరి 22 తేదీలలో గూడెంకొత్తవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధి దారాలమ్మ ఆలయం మూడో మలుపు వద్ద దారి దోపిడీ జరిగింది. ఈ నాలుగు దోపిడీల్లో దుండగులు రూ.67 వేల నగదు, మూడున్నర తులాల బంగారం, ఒక స్కార్పియో వాహనం, 6 సెల్ ఫోన్లు దోచుకున్నారు. ఈ ప్రాంత ప్రజలను, ప్రయాణికులను భయాందోళనలకు గురి చేసిన దోపిడీదారులను సీలేరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు వివరించారు.

ads

దోపిడీదారులు సెల్ సిగ్నల్ లేని, పోలీసులు సకాలంలో అందుబాటులోకి రాని ప్రదేశాలను ఎంచుకుని ఇటువంటి దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. గ్రామస్తుల సహకారంతో ప్రత్యేక నిఘాతో దోపిడీదారులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. మరికొందరు గ్రూపులుగా ఏర్పడి ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఏఎస్పీ ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అరెస్టయిన నిందితులు ఒరిస్సా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా ఎంవీ 82 గ్రామానికి చెందిన బికాస్ అధికారి, మోని సర్కార్ గా గుర్తించామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏఎస్పీ విద్యాసాగర్​నాయుడు వివరించారు. ఈ సమావేశంలో గూడెంకొత్తవీధి సీఐ మురళీధర్, సీలేరు ఎస్సై రంజిత్, పీఎస్సై పురుషోత్తం పాల్గొన్నారు.