వరంగల్‎లో ఉప్పెన టీం సందడి

వరంగల్ అర్బన్ జిల్లా : వరంగల్ నగరంలో ఉప్పెన టీం సందడి చేసింది. నగరంలోని రాధికా థియేటర్ లో సాయంత్రం 7 గంటలకు ఉప్పెన షో టైంలో ఉప్పెన టీం వచ్చి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. కృతిశెట్టిని చూసి అభిమానులు థియేటర్ లో బేబమ్మ అంటూ కేకలు వేశారు. అభిమానులను చూసిన బేబమ్మ, వైష్ణవ్ తేజ్ వారిని పలకరించారు. తక్కువ సమయంలోనే ఉప్పెన సినిమాను ఇంత పెద్ద ఎత్తున బ్లాక్ బస్టర్ చేస్తారని అనుకోలేదు, ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మీ అందరికీ రుణపడి ఉంటామని వైష్ణవ్, కృతి అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. తెలుగురాకున్నా అనతికాలంలోనే తెలుగు నేర్చుకున్నాను అంటూ తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడిన బేబమ్మ మాటలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

సుమారు అర్ధగంట పాటు థియేటర్‎లో హంగామా చేసిన ఉప్పెన టీం అనంతరం మీడియాతో కాసేపు ముచ్చటించారు. తక్కువ సమయంలో ఉప్పెనకు ‎ఇంత పెద్ద హిట్ వస్తుందని ఊహించలేదు, చాలా షాకింగ్ గా ఉందన్నాడు హీరో వైష్ణవ్ తేజ్. నా మొదటి సినిమా ఇంత ఆదరణ వస్తుందని ఊహించలేదని హీరోయిన్ కృతిశెట్టి తెలిపింది.చారిత్రక ప్రాంతమైన వరంగల్‎కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ అభిమానుల ఆదరణ మరిచిపోలేమని అన్నారు. ఉప్పెన టీంను చూడటానికి తరలివచ్చిన అభిమానులతో రాధికా థియేటర్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉప్పెన టీం తిరుగు ప్రయాణంలో అభిమానులు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు కరచాలనం చేసి, సెల్ఫీలు దిగారు.