కరోనా కట్టడికి వాక్సినేషన్ తప్పనిసరి : దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా : ప్రతీ ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకుని కరోనా వైరస్ కట్టడిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం హన్మకొండ విజయటాకీస్ వద్ద గల ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ లో మెప్మా, ఎస్ హెచ్ జి లకు ఏర్పాటు చేసిన వాక్సినేషన్ శిబిరాన్ని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ల ఆదేశాల మేరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 కేంద్రాలలో దాదాపు 1లక్ష 90 వేల మెప్మా గ్రూప్ మహిళలకు నేటి నుండి టీకాలు వేయడం జరుగుతుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మెప్మా ఎస్ హెచ్ జి లు టీకాల కొరకు ఆన్లైన్లో నమోదు చేసుకొని టీకాలు వేసుకోవాలని కోరారు. కోవిడ్ రెండోదశ ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ads

రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో, ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కోవిడ్ బారినపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరుగుతున్నదని చెప్పారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా జరగడానికి ఆస్కారం ఉన్న వర్గాలకు ముందుగా వాక్సినేషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఇటువంటి అద్భుత కార్యక్రమాలకి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఇందులో భాగంగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను సజావుగా సాగేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ , అదనపు డీఎంహెచ్ఓ మదన్ మోహన్, మెప్మా పీడీ, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎమ్ లు, తదితరులు పాల్గొన్నారు.