హైదరాబాద్ : రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవిని గెలిపించాలని హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ కోరారు. బుధవారం పబ్లిక్ గార్డెన్ లో వాకర్స్ తో కలిసి హోం మంత్రి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. మార్నింగ్ వాక్కు వచ్చిన వారికి టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి ని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ నాయకులు బండి రమేశ్, సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, అబ్దుల్ బాసిత్ తదితరులు ఉన్నారు.
