రేపు మార్కెట్​లోకి విజయ ఐస్ క్రీం

హైదరాబాద్​ : నష్టాల ఊబీ లో నుంచి లాభాల బాటలో పయనిస్తున్న తెలంగాణ విజయ డెయిరీ మరో నూతన ఉత్పత్తిని మార్కెట్ లోకి విడుదల చేయనుంది. తెలంగాణ విజయ డెయిరీ నూతన ఉత్పత్తి విజయ ఐస్ క్రీం ను మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు నాంపల్లి లోని లలిత కళాతోరణం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, సీఎస్​ సోమేశ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ చైర్మన్ శ్రీ లోక భూమారెడ్డి ల సమక్షంలో ఆవిష్కరిస్తారు.

విజయ పేరుతో కుల్ఫీ, చాకోబార్, అమెరికానో, బెల్జియన్ డార్క్ చాకొలేట్, ఫ్రెంచ్ వెనీలా తదితర 30 రకాల ఫ్లేవర్లలో ఐస్ క్రీం లను ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ, రాష్ట్రం ఆవిర్బవించిన అనంతరం సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, నిర్ణయాలతో లాభాల బాటలో పయనిస్తుంది. ప్రైవేటు డెయిరీలకు దీటుగా విజయ డెయిరీ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించారు. విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున నూతనంగా ఔట్ లెట్స్ ఏర్పాటు చేశారు. దీంతో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 362 ఔట్ లెట్స్ ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఏపీలో కూడా తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.