మోటర్ సైకిళ్ల దొంగ అరెస్టు

వరంగల్ అర్బన్ జిల్లా : తండ్రి పట్టించుకోవడం లేదని, జల్సాల కోసం ఈజీ మనీ సంపాదనకు దొడ్డి దారి వెతికిన ఓ వ్యక్తి పోలీసులకు చిక్కిపోయాడు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అంబాల అజయ్ మోటారు సైకిళ్లను దొంగిలించి, వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మోటారు సైకిల్ ను దొంగిలించి దాన్ని హన్మకొండలో విక్రయించేందుకు ఈ నెల 25న వంగర నుంచి హన్మకొండ కు వెళ్తున్నాడు. దారి మధ్యలో ఎల్కతుర్తిలో రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన అజయ్ ను పోలీసులు విచారించారు. అతని వివరాలు, బైక్ పత్రాలు అడుగగా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పడంతో పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

దీంతో మోటార్ సైకిల్‎ను దొంగిలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. అంతేగాకుండా ఇంతకు ముందు హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ మోటర్ సైకిల్, హుజురాబాద్‎లో మరో మోటర్ సైకిల్ దొంగిలించగా ఎల్కతుర్తిలోని బస్టాండ్ వద్ద ఓ హోటల్ ముందు నుంచి సైతం మోటర్ సైకిల్ ను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. మొత్తంగా ఇప్పటికి మూడు మోటర్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుని వివరాల మేరకు దొంగిలించిన మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని , బాలున్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో వున్న నిందితుడు అజయ్ ను కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇంతకు ముందు ఎల్కతుర్తి స్టేషన్ లో ఓ బైక్ మిస్సింగ్ కేసు నమోదు చేయబడింది. బాలున్ని పూర్తి స్థాయిలో విచారించగా తాను ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇతనికి తల్లి లేదని, తండ్రి, చెల్లి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రూ. 150వేల విలువ చేసే దొంగిలించబడిన 3 మోటార్ సైకిళ్ళనుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోటర్ సైకిళ్లను రికవరీ చేసి దొంగను పట్టుకోవడంలో ముఖ్య పాత్ర వహించిన కానిస్టేబుళ్లు ఆలి, సంపత్, నయీంలకు కాజిపేట ఏసీపీ రవీంద్రకుమార్ క్యాష్ రివార్డ్ అందించారు.