సెంట్రల్ జైలులో కమలనాథులు

వరంగల్ : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపైదాడి కేసులో మొత్తం 42 మందిని జ్యుడిషియల్ రిమాండ్‎కు తరలించారు. ఈ మేరకు ఈనెల 15 వరకు రిమాండ్ విధిస్తూ వరంగల్ ఆరో అదనపు కోర్టు మెజిస్ట్రేట్ కె.కుమారస్వామి పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల బీజేపీ అధ్యక్షులు రావు పద్మారెడ్డి, కొండేటి శ్రీధర్ సహా మొత్తం 43 మందిని సోమవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

రామమందిరం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై కర్రలు, రాళ్లు, కోడి గుడ్లతో దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఈవిషయంపై సుబేదారి ఎస్సై సాంబమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం 57 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీనిలో భాగంగా 43 మందిని అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరుచగా, వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరోవైపు బీజేపీ నేతలు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై మంగళవారం వాదనలు జరుగనున్నాయి. ఈ కేసులో ఇంకా 14 మందిని పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంది.

ఈరోజు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రూరల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి, గురుమూర్తి శివ కుమార్, రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, బాకం హరిశంకర్ లతో పాటు మొత్తం 43మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలకు 14రోజుల రిమాండ్ విధిస్తూ సెంట్రల్ జైల్‎కి తరలించారు. సెంట్రల్ జైలుకు వెళ్లిన 43 మందిలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు ఐదుగురు మహిళా కార్యకర్తలు ఉన్నారు.వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లిన క్రమంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టీఆర్ఎస్‎ను ఎండగట్టింది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులతో మా పై అక్రమ కేసులను నమోదు చేసి బీజేపీని అణచివెయ్యాలని చూస్తున్నారని మండిపడ్డారు. శ్రీరామున్ని కించపరుస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఎమ్మెల్యే తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాముడికి ప్రాంతీయ బేధం అంటగట్టడం టీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పోలీసుల వ్యవస్థపై మాకు గౌరవముందని, కానీ కొంతమంది అధికారుల తీరు వలన ఆ వ్యవస్థ అగౌరవం మూటగట్టుకుంటుందని విమర్శించారు.

తెలంగాణలో పోలీసులకు పింక్ డ్రెస్సులు కాదు, ఇంకా ఖాకీ డ్రెస్సులే ఉన్నాయన్న మాట మర్చిపోవద్దని రావు పద్మ గుర్తు చేశారు. పోలీసుల అండతోనే టీఆర్ఎస్ గుండాలు రెచ్చిపోతున్నారని ఆమె ఆరోపించారు. టీఆర్ఎస్ దాడులను నిరసిస్తూ రేపు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో, జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రావు పద్మ పిలుపునిచ్చారు.