కేసిఆర్ కి ఎంతో రుణపడి ఉంటాం: సత్యవతి

మహబూబాబాద్ జిల్లా : “జీవిత కాల కల నెరవేరింది. ఈ సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఈ కలను నిజం చేసిన అపర భగీరథుడు సీఎం కేసిఆర్ కి ఎంతో రుణపడి ఉంటాం.” అని రాష్ట్ర గిరిజన, స్త్రీ –శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సారెస్సీ ద్వారా తన స్వగ్రామం గుండ్రాతి మడుగుకు నీరు వచ్చే కాలువ డిఎం-40లో వేదమంత్రాల సాక్షిగా నేడు పూల హారతి ఇచ్చారు.

ads

2003లో చంద్రబాబునాయుడు కాలంలో ఈ కాలువ ద్వారా నీరు తెచ్చే ప్రయత్నం జరిగిందని, ఆ తర్వాత పాలకులు పట్టించుకోకపోవడంతో అది కలగానే మిగిలిందన్నారు. సీఎం కేసిఆర్ అపర భగీరథుని వలె కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుతూ సాగునీరు, తాగునీరు అందిస్తున్నారన్నారు. ఈ కాలువలో నేడు నీరు పారుతూ గుండ్రాతి మడుగు, నారాయణపురం, మొగిలిచర్ల గ్రామాలకు నీరు ఇచ్చి కలను నిజం చేశారన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇందుకోసం ఓ రైతు బిడ్డగా, ఈ ప్రాంత ప్రజల ప్రతినిధిగా ముఖ్యమంత్రి కేసిఆర్ కి ఎంతో రుణపడి ఉంటామని, సీఎం కేసీఆర్ కు మంత్రి సత్యవతి రాథోడ్ పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, స్థానిక జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీరాం నాయక్, వేణుగోపాల రెడ్డి, సురేష్ రావు, ఇతర నాయకులు, నేతలు పాల్గొన్నారు.