50 దేశాల్లో సీఎం బర్త్ డే వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈనెల 17న టీఆర్ఎస్ ఎన్నారై ఆధ్వర్యంలో ప్రపంచమంతా ఘనంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. శనివారం ప్రపంచవ్యాప్తంగా టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షులతో మహేశ్ బిగాల జూమ్ యాప్‎లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ఆయా దేశాల్లో వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. రక్తదాన శిబిరాలు, గ్రీన్ చాలెంజ్‎లో భాగంగా మొక్కలు నాటడం, అనాథలకు సాయం అందించడం తదితర సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు మహేశ్ బిగాల వెల్లడించారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని ఆయన సూచించారు.