కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం

కరీంనగర్ జిల్లా : కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ హామీ ఇచ్చారు. శనివారం పార్టీ కార్యకర్త బిడ్డ పుట్టిన రోజు విషయం తెలుసుకుని సర్​ప్రైజ్​గిఫ్ట్​ అందజేశారు. అనంతరం పాపకు ఫోన్​ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ads

కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్​లో 20 రోజులుగా ఉంటున్నారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఖాజా నవాజ్ హుస్సేన్ మామ మృతిచెందారు. అయినప్పటికీ పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించడానికి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. హైదరాబాద్​లోనే ఉంటూ పార్టీ అప్పజెప్పిన విధులను నిర్వహించారు.

మరోవైపు ఖాజా నవాజ్ హుస్సేన్ భార్య తొమ్మిది నెలల గర్భవతి. అయినప్పటికీ ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటూ భార్యకు దైర్యం చెబుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో హుస్సేన్​ విషయం కేటీఆర్​ దృష్టికి వచ్చింది. పార్టీ కార్యకర్త నిబద్ధతకు చలించిపోయిన కేటీఆర్ ఖాజా నవాజ్ హుస్సేన్ యోగక్షేమాలు విచారించారు. ఈ సందర్భంలో శనివారం హుస్సేన్​ కూతురు నబీలా మహమ్మద్ పుట్టిన రోజు విషయం ఉందని మంత్రి కేటీఆర్​ తెలుసుకున్నారు

వెంటనే పుట్టిన రోజు కానుకగా సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పాపకు అక్కడి పార్టీ నాయకుల ద్వారా మంత్రి కేటీఆర్ అందజేశారు. అంతేకాదు పాపకు స్వయంగా ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఏం కావాలి అంటూ కేటీఆర్ పాపను అడిగారు. నాకేమీ వద్దు.. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అంతే చాలు అన్న పాప సమాధానం విని కేటీఆర్ చలించిపోయారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని కేటీఆర్​ ఆనందం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీకి బలం కార్యకర్తల నిబద్ధత, వారి త్యాగాలే అని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, వారి కటుంబాలకు ఏ ఆపద వచ్చినా టీఆర్ఎస్ అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు.