అధికారంలోకి వస్తే రద్దు చేస్తాం

సహరన్‎పూర్ : తాము అధికారంలోకి వస్తే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‎లోని సహరన్‎పూర్‎లో కిసాన్ మహాపంచాయత్‎ను ఉద్దేశించి ప్రియాంక గాంధీ మాట్లాడారు. వ్యవసాయ చట్టాలతో రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలు అరబ్‎పతిలకు మేలు చేస్తాయని, వారే రైతుల పంటకు ధరను నిర్ణయింస్తారని వ్యాఖ్యానించారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రియాంక పేర్కొన్నారు.

వచ్చే యేడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‎లో జై జవాన్, జై కిసాన్ పేరుతో రాష్ట్రంలోని 27 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ క్యాంపెయిన్‎ను చేపట్టింది. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నేతలంతా పాల్గొంటారని యూపీ కాంగ్రెస్ మీడియా కన్వీనర్ లలన్ కుమార్ పేర్కొన్నారు. సహరన్‎పూర్, షమ్లి, ముజఫర్‎నగర్, భాగ్పట్ , మీరట్, బిజ్నోర్ , హపూర్, బులంద్‎షహర్, అలీఘడ్ , హథ్రాస్, మధుర, ఆగ్రా, ఫిరోజాబాద్, బదౌన్, రాంపేర్ , ఫిలిబిత్, లఖింపూర్ ఖేర్, సీతాపూర్, హర్దోయ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. ఇక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.