సాగ‌ర్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని నెరవేరుస్తాం

నల్గొండ జిల్లా : నాగార్జున సార‌గ్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలియ‌జేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తోపాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాన‌ని సీఎం స్పష్టం చేశారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామన్నారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యలన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ads

ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సీఎం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టిఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని సీఎం అన్నారు. విజయం సాధించిన అభ్యర్ధి నోముల భగత్ కు సీఎం కేసీఆర్‌ హృదయ పూర్వక అభినందనలు చెప్పారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఈ సంద‌ర్బంగా నోముల భగత్ కు సీఎం సూచించారు. నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సీఎం అభినందనలు చెప్పారు.