తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో వర్షం


న్యూఢిల్లీ : రాగల 24 గంటల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ శనివారం తెలిపింది. సిక్కిం, పశ్చిమబెంగాల్, తూర్పు ఆగ్నేయ ప్రాంతాల్లోని బీహార్, జార్ఖండ్, ఒడిశా, చత్తీస్ గఢ్ , తూర్పు ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మధ్య మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ లోని గిల్గిత్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్, లడఖ్ ప్రాంతాల్లో వర్షం, హిమపాతం కురుస్తుందని, 24 గంటల తర్వాత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

పశ్చిమ అవాంతరాల కారణంగా ఈ నెల 21 నుంచి 25 ంరకు కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉంటాయని పేర్కొంది. 23న సిమ్లా సోలన్, సిర్మౌర్, మాండీ, కులు, చంబా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, ఈ మేరకు హెచ్చరిక జారీ చేశారు. ఈనెల రెండో వారం నుంచి ఉత్తర భారతంలోని మైదాన ప్రాంతాల్లో చలిగాలులు వీయలేదు. దీంతో చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఎగువ, మధ్య పర్వత ప్రాంతాల్లో 21న హిమపాతం కురిసే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల్లో వడగండ్లు పడే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.

ఫిబ్రవరి 22న భారీగా హిమపాతం, వర్షం కురుస్తుందని చెప్పింది. అలాగే దేశ రాజధానిలో చల్లని వాతావరణం ఉంటుందని, దేశ రాజధాని ఢిల్లీని భారీగా పొగమంచు కప్పేస్తోంది. శనివారం ఉదయం సైతం నేషనల్ క్యాపిటల్ రీజియన్ పొగమంచుతో నిండిపోయింది. మరో మూడు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.