బాబుపై ఏం చర్యలు తీసుకుంటారు

విజయవాడ : పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకుంటారని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి విలేకర్ల సమావేశం నిర్వహించారు.

‘మేనిఫెస్టో విడుదల చేసిన ఈ దుర్మార్గం మీద చట్టపరంగా చర్యలు తీసుకునే ఉద్దేశం నిమ్మగడ్డకు ఉందా? లేదా?.. ఉంటే, టీడీపీ గుర్తింపు రద్దు చేస్తారా..? అని మండిపడ్డారు. ఎస్ఈసీ రాజ్యాంగ స్ఫూర్తితో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారని అంబటి ఎస్​ఈసీ తీరును దుయ్యబట్టారు. పార్టీ రహిత ఎన్నికలను రాజకీయ పార్టీల ఎన్నికలుగా మార్చాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.

చంద్రబాబు, ఎస్ఈసీ కలిసి పనిచేసినా తెలుగుదేశం పార్టీని బతికించలేరని అంబటి ఎద్దేవా చేశారు . ప్రజాస్వామ్యంలో మితిమీరి ప్రవర్తించినా, లక్ష్మణ రేఖ ఎవరు దాటినా చర్యలు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా.. ? తెలుసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి బాబు పై ఏం చర్యలు తీసుకుంటారో ఎస్ఈసీ తక్షణం సమాధానం చెప్పాలి అని అంబటి రాంబాబు డిమాండ్​ చేశారు. హైదరాబాద్ ను వదలకుండా దుగ్గిరాలలో ఓటు ఎలా ఇస్తారు..? ఇది అధికారులపై కక్ష సాధించటం కాదా’ అని అంబటి రాంబాబు ఆరోపించారు.