ధోనీ అకాడమీ ఎక్కడంటే..


హైదరాబాద్: త్వరలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక క్రికెట్ అకాడమీ హైదరాబాద్‎లో ఏర్పాటు కాబోతోంది. టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలంగాణలో క్రికెట్ అకాడమీ ప్రారంభించోతున్నాడు. ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ పేరుతో అకాడమీని నెలకొల్పబోతున్నాడు.

ధోనికి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ బ్రెయినియాక్స్ బీతో శుక్రవారం ఒప్పందం చేసుకున్నది. రాబోయే రెండేండ్లలో కనీసం 15 అకాడమీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారత మాజీ అండర్- 19 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మిహిర్ దివాకర్ ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ అకాడమీ తనతో పాటు ధోనీ మానసపుత్రిక అని అన్నాడు.

తెలంగాణ యువతకు శుభపరిణామంగా ఉన్న ధోనీ నిర్ణయం యువ, గ్రామీణ క్రీడాకారుల్లో మరింత ఉత్సాహం నింపనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ కెరీర్ ప్రారంభంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వచ్చే రెండేండ్లలో తెలంగాణతో పాటు కర్ణాటక ( బెంగుళూరు మినహాయించి), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కనీసం 20-25 శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దివాకర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మొదటి అకాడమీ ఈ ఏడాది ఏప్రిల్‎లో బళ్లారిలో మొదలుకానుందని చెప్పారు.

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారెల్ కలినన్, ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ కోచింగ్ డైరెక్టర్‎గా కొనసాగుతున్నారు. ఇండియాలో ఇప్పటికే 50కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో మూడింటిని ప్రారంభించారు. ధోనీ ఎడ్యుకేషన్ విభాగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే జూన్ నుంచి బెంగళూరులో ఎంఎస్ ధోనీ గ్లోబర్ స్కూల్ కూడా ప్రారంభించనున్నారు.