కేసీఆర్ లేకుంటే టీకాంగ్రెస్,టీబీజేపీ ఎక్కడివి ?

హైదరాబాద్: నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. నల్లధనం తీసుకురాలేదు కానీ నల్లచట్టాలను మాత్రం తీసుకొస్తున్నారని ప్రధాని మోడీని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జీడీపీ పెంచుతామని చెప్పి గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరుపై మండిపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‎తో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై, రాష్ట్రంలో టీ కాంగ్రెస్, టీ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ హెచ్చరికలు చేశారు.

ads

న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారినే సీఎం కేసీఆర్‌ అడ్వకేట్‌ జనరల్‌గా నియమించినట్లు తెలిపారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని మోడీని సీఎం కేసీఆర్‌ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన తర్వాతనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చినంక రైతులకు ఎంతో లబ్ది జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు రైతులకు కరెంట్‌ లేదు, ఎరువులు లేవు, రుణ కష్టాలుండేవి. కాగా సాధించుకున్న తెలంగాణలో దేశమే అబ్బురపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ చేపట్టారని మంత్రి కేటీ‎ఆర్ కొనియాడారు. ప్రధాని మోదీ కూడా మన పథకాల్ని కాపీ కొట్టినట్లు తెలిపారు. గతంలో 24 లక్షల మందికి పింఛన్లు వస్తే ఇప్పుడు 42 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. 9 లక్షల మంది అమ్మాయిలకు రూ.1లక్షా 116 లు ఇచ్చాం. రైతు బీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదు. రైతు ఎలా చనిపోయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నట్లు వెల్లడించారు. 945 గురుకులాల ద్వారా ఉచిత విద్య అందిస్తున్నాం. ఉన్నత చదువుల కోసం రూ.25 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నట్లు తెలిపారు.
కొందరు సోషల్‌ మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ లేకపోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్‌ ఎక్కడ ఉండేవని ప్రశ్నించారు. మీ ముఖాలకు ఎంతోకొంత విలువ వచ్చిందంటేనే అది టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ వల్లేనని కేటీఆర్ మండిపడ్డారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్‌ కఠినంగా ఉన్నారని తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు. వామన్‌రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్లు దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చినంక న్యాయవాదుల కోసం ఏం చేసిందో రాంచందర్‌రావు చెప్పాలని ప్రశ్నించారు. న్యాయవాదుల కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వంలో రూ.10 వేల కోట్లతో న్యాయవాదుల సంక్షేమం కోసం నిధి ఏర్పాటు చేయించాలన్నారు.

ప్రశ్నించే గొంతు అని చెప్పే రాంచందర్‌రావు బయ్యారం స్టీల్‌, వరంగల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ గురించి కేంద్రం ప్రభుత్వం వద్ద ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో న్యాయవాదుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలని కోరారు. తెలంగాణలో మాదిరిగా మీ పాలిత ప్రాంతాల్లో చేస్తున్నారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.