B.1.617వేరియంట్ వల్లే కరోనా విలయం

న్యూఢిల్లీ : అత్యంత వేగంగా వ్యాపించే ఆ వేరియంట్ వల్లే భారత్ లో ఇంతటి కరోనా విలయం ఏర్పడిందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఈ వేరియంట్ వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఏ.ఎఫ్.పీ.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. కరోనాకు చెందిన B.1.617 వేరియంటే ఈ విపత్తకు కారణమని ఆమె స్పష్టం చేశారు. దీనిని గత సంవత్సరం అక్టోబర్ లో తొలిసారి భారత్ లోనే గుర్తించారన్నారు. దీనిని ఒక ప్రత్యేకమైన వేరియంట్ గా డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ మధ్య లిస్ట్ చేసింది.

ads

ఇప్పటి దాకా కరోనా వ్యాప్తిని పెంచిన వేరియంట్లు ఎన్నో ఉన్నాయని, అందులో B.1.617వేరియంట్ ఒకటని సౌమ్య చెప్పారు. ఐతే దీనిని ఇప్పటి వరకూ ఆందోళన కలిగించే వేరియంట్ గా మాత్రం డబ్ల్యూహెచ్ఓ గుర్తించలేదు. ఈ ముద్ర పడిందంటే ఇది ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందన్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమైందని, వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టిస్తుందని అన్నారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు దీనిని ఆందోళన కలిగించే వేరియంట్ గా గుర్తించగా, త్వరలోనే డబ్ల్యూహెచ్ఓ కూడా గుర్తిస్తుందని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు.

సహజంగా లేదా వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన యాంటీబాడీలను కూడా బోల్తా కొట్టించే కొన్ని మ్యుటేషన్లు ఈ B.1.617వేరియంట్ లో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అందుకే దీనిని ఆందోళన కల్గించే వేరియంట్ గా గుర్తించవచ్చని తెలిపారు. అయితే ఈ వేరియంట్ దే మొత్తం బాధ్యత అని చెప్పలేమని, కరోనా వెళ్లిపోయిందని బాధ్యతారహితంగా తిరిగారని, అందువల్లే ఈ విపత్తు అని ఆమె అభిప్రాయపడ్డారు.