ఈటల ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా: గంగుల

కరీంనగర్ జిల్లా : తన హత్యకు జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నారంటూ ఈటల చేసిన ఆరోపణలపై ఘూటుగా స్పందించారు రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ లో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఒకవేళ ఈటెలపై ఎవరైనా దాడిచేసినా తను రక్షణ కవచంలా నిలిచి కాపాడుకుంటానన్నారు. ఆయన పూర్తి రక్షణ భాద్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఈటెలతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, పార్టీలు వేరు కాబట్టే రాజకీయ పోరాటం మాత్రమే చేస్తానని పునరుద్ఘాటించారు. పెద్దమ్మ తల్లికి దండం పెట్టి కోరుకుంటున్నా ఈటల రాజేందర్ క్షేమంగా ఉండాలని నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

ads

కానీ సీఎం కేసీఆర్ పై ఇష్టారీతిన మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేవలం సానుభూతి కోసం నిరాదార ఆరోపణలు ఈటెల రాజేందర్ చేస్తున్నాడని, తనపై హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఈటెలకు రహస్యంగా చెవిలో చెప్పిన మాజీ నక్సలైట్ ఎవరో బయటపెట్టాలని అన్నారు. ఈ కుట్రపై బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని అమిత్ షాకు ఫిర్యాదు చేసైనా రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలపై నమ్మకం లేకుంటే కేంద్ర ప్రభుత్వ విచారణ ఏజెన్సీలు వేటితోనైనా, అవసరమైతే సీబీఐతో విచారణ చేసి అత్యంత త్వరలో దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల.

ఈ విచారణలో దోషిగా తేలితే రాజకీయాల్ని వదిలేస్తానని, లేదంటే ఈటల రాజెందర్ క్షమాపణ చెప్పాలని, రాజకీయాల్నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారు. మీరు తొందరగా విచారణ చేసి దోషుల్ని తేల్చక పోతే సానుభూతి ఓట్లకోసమే మీరు ఆడుతున్న డ్రామా అని తేలిపోతుందన్నారు. మీరు విచారణ చేసే వరకూ ప్రతీ రోజూ విచారణ చేయాల్సిందిగా కోరుతూనే ఉంటానన్నారు మంత్రి గంగుల. కేసీఆర్ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దాడులు, హత్యలు ఉండవని ఈటెలకు హితవు పలికారు.

ఉంటే రాజకీయ ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని, ఈరోజు ఈటెల రాజేందర్ చేసిన హత్యారోపణలు వ్యక్తిగతంగానూ, తెలంగాణ రాష్ట్రానికి కూడా చెడ్డపేరు, మచ్చ తెచ్చేవిధంగా, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేవిధంగా ఉన్నాయని ఆరోపించారు. ఎంతో పాటు, డిజిపి, సిపిలను ఈటల డ్రామాలపై తక్షణ విచారణ చేయాల్సిందిగా మంత్రి గంగుల విజ్ణప్తి చేశారు. ఈటల ప్రాణమైన, గంగుల కమలాకర్ ప్రాణమైన ఇంకెవరి ప్రాణమైనా తెలంగాణ ప్రభుత్వానికి విలువైనదేనన్నారు. ఈరోజు ఈటెల రాజెందర్ సొంతగా తన మనుషులతోటే తనపై దాడి చేసుకొని దాన్ని తమపై వేయడానికి కుట్ర చేస్తున్నారనే సమాచారం ఉంది. కాబట్టి ఈటెల పాదయాత్రకు బందోబస్తు పెంచడమే కాక అలాంటి కుట్రల్ని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు మంత్రి గంగుల కమలాకర్.

ఇప్పటివరకూ తనపై ఎలాంటి నేర చరిత్ర లేదని, తనపై ఆరోపణలు చేసిన ఏ ఒక్కరిపైనా ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు మంత్రి గంగుల. కానీ ఈటల హుజురాబాద్లో ఎంతమందిని అణిచివేశాడో, వేధించాడో బహిరంగ రహస్యమేనన్నారు. తెలంగాణలో లేని దాడి, హత్యా సంస్కృతిని తీసుకొచ్చే ప్రయత్నం ఈటల చేయడం హేయమన్నారు.కేసీఆర్ ఆధ్వర్యంలో పచ్చగా కలకలలాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చిచ్చుపెట్టడం దారుణమన్నారు. పదవుల కోసం పెదవులు మూయను అన్న ఈటెల ఓటమి భయంతో అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు.

పాదయాత్రలో ఉన్న ఈటలను తన హత్య కోసం ఏ మంత్రి ప్రయత్నిస్తున్నాడో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేయాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలను నియోజకవర్గాన్ని ఈటల అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత మేం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది.. ఒక్క హుజురాబాద్ ఎందుకు చెందలేదో ఈటెలను ప్రశ్నించాలన్నారు. తన నియోజకవర్గంలో ఏ సమస్యలున్నాయో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి నిధులు తెచ్చుకోవడంలో ఈటల విఫలమయ్యారని దుయ్యబట్టారు.