కేరళలో త్రిపుర మంత్రం బీజేపీకి ఫలించేనా..!

తిరువనంతపురం : కేరళ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. త్రిపురలో పాటించిన విధానాన్నే కేరళలో కూడా పాటించి క్రిస్టియన్ల మద్దతుతో అధికారంలోకి రావాలని కలలుకంటున్నది. మరి ఇది సాధ్యమవుతుందా..త్రిపుర మంత్రం కేరళలో బీజేపీకి లాభించేనా…అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. 2018లో త్రిపుర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అక్కడి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదిపిన బీజేపీ పార్టీ అక్కడ తన కలలను సాకారం చేసుకున్నది. అదే తీరుగా కేరళలో కూడా ఇప్పుడు వామపక్ష ప్రభుత్వం నుంచి అధికారం లాక్కొనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది.

ads

ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రభుత్వానికి ఓటు వేసిన రికార్డు కేరళకు ఉన్నది. 1980 నుంచి అలా జరుగుతూ వస్తున్నది. కేరళలో ఒక్కటే బలమైన వామపక్షం ప్రభుత్వం నిలిచి ఉంది. 2018లో త్రిపురను తమ హస్తగతం చేసుకోగా..కేరళ ఒక్కటే వామపక్షాల గుప్పిట్లో ఉన్నది. త్రిపురలో మాదిరిగానే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేరళలో కూడా వామపక్షాలకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది. రానున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 2018 త్రిపుర ఎన్నికలలో మాదిరిగానే బీజేపీ కూడా అండర్ డాగ్ ఛాలెంజర్‎గా ఉండనున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

త్రిపురలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ నాయకులు అక్కడి క్రిస్టియన్ మతబోధకులు, పెద్దలను దగ్గరికి చేర్చుకున్నారు. క్రిస్టియన్లకు ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చిన మేరకు వారు బీజేపీకి మద్దతుగా నిలిచారు. దాంతో అక్కడ సులభంగా అధికారాన్ని చేజిక్కించుకున్నది. ప్రస్తుతం కేరళ ఎన్నికల్లో కూడా అదే మంత్రాన్ని పఠించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 19న కేరళకు చెందిన క్రిస్టియన్ మతపెద్దలతో కూడిన ప్రతినిధి బృందం ప్రధాని మోదీతో సమావేశమైంది.

ఈమేరకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం తమ మైనార్టీ సంక్షేమ పథకాలలో ముస్లిం సమజానికి అదనపు ప్రయోజనాలు ఇవ్వడంపై ప్రధానికి వారు ఫిర్యాదు చేసినట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి. చర్చి నాయకులు ‘లవ్ జిహాద్’ గురించి మాట్లాడారని తెలిసింది. లవ్ జిహాద్ అనే పదం కేరళ నుంచే ప్రారంభమై.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది. ఉత్తరప్రదేశ్‎లోని బీజేపీ ప్రభుత్వం దీనిని పరిష్కరించేందుకు చట్టాన్ని కూడా రూపొందించింది.

హిందుత్వం, అభివృద్ధి అనేవి బీజేపీ ప్రధాన ఎన్నికల గుర్తులా మిగిలి ఉండగా, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పార్టీ క్రైస్తవ సమాజానికి పెద్ద ఎత్తున చేరుకునే ప్రయత్నం చేసింది. 2020 డిసెంబర్‎లో కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 500 మంది క్రైస్తవ అభ్యర్థులను బీజేపీ నిలబెట్టింది. పతనమిట్ట జిల్లాలోని శబరిమల యుద్ధభూమిగా ఉన్న పండలం మునిసిపాలిటీలో విజయం సాధించింది. దీంతో ఇప్పటివరకు కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్టడుగున ఉన్న బీజేపీ మెల్లమెల్లగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ టార్గెట్ కమ్యూనిటీని చేరుకునే వ్యూహంలో నిమగ్నమై ఉన్నది.

కేరళలో క్రీస్తు శకం 105లో నిర్మితమైన సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చ్ జాతీయ రహదారి పక్కనే ఉన్నది. ఈ జాతీయ రహదారి పునర్నిర్మాణంలో భాగంగా ఈ పురాతన చర్చిని కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీనిపై స్థానిక క్రిస్టియన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వామపక్ష ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయంలో బీజేపీ నేత బాలశంకర్ ఒక్కరే స్పందించి విషయాన్ని ప్రధాని కార్యాలయానికి చేరవేశారు. దాంతో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా మధ్యవర్తిత్వంతో చర్చ్‎ను రక్షించేందుకుగాను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( ఏఎస్ఐ) కి గత నెలలో అప్పగించారు. దాంతో ఈ పురాతన చర్చ్‎ను కూల్చివేసే పనులు నిలిచిపోయాయి. అందుకు దక్షిణగా అలప్పుజా జిల్లాలోని చెంగనూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నిలువనున్న బాలశంకర్‎కు మాలంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ పూర్తిగా మద్దతు ప్రకటించింది. చెంగనూర్ స్థానం ఇప్పటివరకు సీపీఎం ఆధీనంలో ఉన్నది.

ఇక ముస్లింలలోని కొన్ని సమూహాలు హిందూ కమ్యూనిటీ బాలికలను, మహిళలను ఉద్దేశపూర్వకంగా రప్పించి వివాహానికి ముందు లేదా తర్వాత మతం మార్చుకోవాలని బలవంతం చేస్తున్నాయని ఆరోపించడానికి ముందు కేరళో ‘లవ్ జిహాద్’ సమస్యను ఒక చర్చ్ విభాగం లేవనెత్తింది. ఇది క్రైస్తవుల్లో ఒక భాగాన్ని బీజేపీకి దగ్గర చేసిందని కేరళ రాజకీయాలు తెలిసిన పెద్దలు చెప్తున్నారు. కేరళలో 18 -20 శాతం క్రైస్తవ ఓటర్లు ఉండగా, ముస్లింలు 26-28 శాతం ఉన్నారు. 1950 నుంచి క్రైస్తవ ఓటర్లు కాంగ్రెస్‎కు మద్దతు ఇచ్చారని, ముస్లింలు వామపక్షాల పక్షాన నిలబడ్డారనే అభిప్రాయం ఉన్నది.

అయితే ఈసారి ఎన్నికల్లో హిందూ ఓటర్లతో పాటు క్రిస్టియన్ ఓటర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, త్రిపుర మంత్రం కేరళలో పఠించేందుకు బీజేపీ ఎప్పుడో బీజం వేసినట్లుగా కనిపిస్తున్నది.