పిచ్చుకలను పరిరక్షించాలి: దాస్యం

హైదరాబాద్​ : పిచ్చుకలను పరిరక్షించాలని ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని శనివారం అటవీ శాఖ కేబీఆర్ పార్క్ లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పిచ్చుకలకు సంబంధించిన వివిధ రకాల చిత్రాలను ప్రదర్శించారు.

ads

‘చూడడానికి చిన్న ప్రాణే అయినా జీవవైవిధ్యంలో తన వంతు పాత్రను పోషిస్తోన్న పిచ్చుకలు నగరాలు కాంక్రీట్ జంగిల్ గా మారడం మూలాన కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని వినయ్​భాస్కర్​ ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవం వల్ల పెరుగుతున్న రేడియేషన్ వల్ల చిట్టి గువ్వలు బలవుతున్నాయన్నారు. పిచ్చుకలను రక్షించేందుకు పక్షి ప్రేమికులు నడుం బిగించాల్సిన పరిస్థితి వచ్చిందని దాస్యం వినయ్​ భాస్కర్​ అభిప్రాయపడ్డారు. పిచ్చుకల సంరక్షణ కోసం అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునే బాధ్యత మనపై ఉందన్నారు. అంతరిస్తున్న పక్షుల జాబితాలో ఉన్న పిచ్చుకలను సంరక్షించాలన్న లక్ష్యంతో ఏటా మార్చి 20వ తేదీని పిచ్చుకల సంరక్షణ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఇదే స్పూర్తితో వరంగల్ వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యంలో పలు రకాల వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆ సంస్థ నిర్వహకులైన శ్యామ్ సుందర్ ,నాగేశ్వర్ రావులను ఎమ్మెల్యే దాస్యం అభినందించారు.

ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని వాటి సంరక్షణకు ‘గిఫ్ట్​ ఎ నెస్ట్’​అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తునట్లు దాస్యం ప్రకటించారు. ఈ సందర్భంగా పక్షి గూళ్లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , ప్రముఖ గాయకుడు , బిగ్ బాస్ – 4 విజేత రాహుల్ సిప్లిగంజ్ లకు బహుమతిగా అందజేసి వారందరినీ గిఫ్ట్​ ఎ నెస్ట్​ ఛాలెంజ్ కి నామినేట్ చేశానని వినయ్​భాస్కర్​ పేర్కొన్నారు. వేసవికాలం రానున్న తరుణంలో చెట్లన్నీ ఎండిపోయి పక్షులకు ఆవాసం , తాగునీరు కరువై వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయన్నారు. కాబట్టి వాటిని సంరక్షించడం కోసం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని’ దాస్యం వినయ్​భాస్కర్​ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, సీసీఎఫ్ అక్బర్, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ బాధ్యులు శ్యామ్ సుందర్ శర్మ , నాగేశ్వర్ రావు , కేబీఆర్ వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయ్ కుమార్ పక్షి ప్రేమికులు పాల్గొన్నారు.