ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో పతకాల పంట
భారత్ ఖాతాలో ఆరు పతకాలు
మూడు స్వర్ణాలు
మరోసారి స్వర్ణం సాధించిన తెలుగమ్మాయి
వరంగల్ టైమ్స్, దక్షిణ కొరియా : విశాఖపట్టణానికి చెందిన అథ్లెట్ యర్రాజి జ్యోతి మరోసారి అంతర్జాతీయ వేదికపై అదరగొట్టింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో గురువారం గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో విజేతగా నిలిచింది. గత సంవత్సరం కూడా ఇదే ఈవెంట్ లో గోల్డ్ మెడల్ గెలిచిన జ్యోతి ఈసారి కూడా చాంపియన్ హోదాను కాపాడుకుంది. జ్యోతి 12.96 సెకన్లలోనే రేసును ముగించింది.జ్యోతి యర్రాజీ కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు కూడా అందుకున్నారు. ఈ ప్రదర్శనతో కొత్త ఆసియా అథ్లెటిక్స్ రికార్డును నెలకొల్పింది.
జపాన్ కు చెందిన యుమి టనాకా (13.07సెకన్లు), చైనా అథ్లెట్ యు యాన్ని (13.07)లను వెనక్కినెట్టి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మహిళల లాంగ్ జంప్ లో రెండు మెడల్స్ దక్కాయి. ఆన్సీ సోజన్ (6.33 మీటర్లు) రజతం గెలవగా, శైలి సింగ్ (6.30మీర్లు) కాంస్యం సాధించింది. భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. సీజన్ బెస్ట్ ప్రదర్శన చేసిన అతను 8.20.92 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని విన్నర్ గా నిలిచాడు. ఈ ఈవెట్ లో 36 యేళ్ళ తర్వాత భారత్ కు స్వర్ణ పతకం దక్కింది. 1989లో దినా రామ్ తర్వాత 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారత అథ్లెట్ గా సబ్లే నిలిచాడు. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో సబ్లేకు ఇది తొలి స్వర్ణం. 2019లో ఇతను రజతం సాధించాడు.
అలాగే మహిళల 4×400 రిలే టీ కూడా 3:34.18 సెకన్లలో రేసును పూర్తి చేసి గోల్డ్ మెడల్ గెలిచింది. జట్టులో జిస్నా మాథ్యూ, రూపాల్ చౌదరి, కుంట రజిత, సుభా వెంకటేసన్ లు ఉన్నారు. 12 యేళ్ల మహిళల 4×400 రిలే టీమ్ స్వర్ణం కైవసం చేసుకోవడం గర్వించదగిన విషయం. ఇంతకు ముందు 2013లో దక్కింది. పురుషుల 4×400 రిలే టీంకు కూడా పతకం దక్కింది. జైకుమార్, ధర్మ్ వీర్ చౌరది, మను టెక్కినాలిల్ సాజీ , విశాల్ లతో కూడిన భారత జట్టు (3:03: 67 సెకన్లు) రజతం కైవసం చేసుకుంది. దీంతో గురువారం ఒక్క రోజే భారత్ ఖాతాలో 6 పతకాలు చేరాయి. మొత్తం 14 పతకాలతో భారత్ మెడల్ టేబుల్ లో రెండో స్థానానికి చేరుకుంది.